వరంగల్, జనవరి 29 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని బల్దియా సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. బుధవారం మేయర్ గుండు సుధారాణి అద్యక్షతన జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ పక్షాన కార్పొరేటర్లు తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఎజెండా అంశాలకు ముందే నగర విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రూ. 12 వేలు అందించాలనే తీర్మానాన్ని ఆమోదించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఎజెండా అంశాల తర్వాత తీర్మానంపై ఆమోదిస్తామని మేయర్ గుండు సుధారాణి చెప్పడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియంం వద్ద బైఠాయించారు. దీంతో ఎజెండా అంశాల తర్వాత రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ తీర్మానానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని మంత్రి కొండా సురేఖ సమావేశంలో ప్రకటించారు.
నగర విలీన గ్రామాల రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప చేయాలి. వారికి ఆత్మీయ భరోసా ఇచ్చేవరకు పోరాడుతాం. కాంగ్రెస్ పాలక వర్గం నగరాభివృద్ధికి చేసింది ఏమీ లేదు. కౌన్సిల్ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి పొగడ్తలకే సరిపోయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రొటోకాల్ ఇవ్వకుండా అధికారులు అవమాన పరుస్తున్నారు. విపక్ష కార్పొరేటర్ల డివిజన్లకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పోరాడుతాం.
-ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి