హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా మూకుమ్మడిగా శుక్రవారం ఉదయమే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాన కార్యాలయం గేటు వద్ద నిల్చొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ చాంబర్, మేయర్ చాంబర్ల వద్ద బైఠాయించారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ కమిషనర్ శివప్రసాద్నాయుడుకు వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి చర్చ లేకుండా జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను ఆమోదించారని, బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లపై కాంగ్రెస్ కార్పొరేటర్లు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడులు చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, సామల హేమ, ఆర్ సునీత, సింధూ ఆదర్శరెడ్డి, శాంతిరెడ్డి, దేదీప్యరావుతో కూడిన బృందం శివప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.