హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష కొరడా దెబ్బలు కొట్టినా తప్పులేదని, అందుకోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు.. గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గురించి ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ తెలిసేలా వివరించినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏ మాత్రం అర్థం కావడం లేదని, దీంతో వారి అజ్ఞానం బయటపడిందని దుయ్యబట్టారు. ‘నేపాల్ రాజు తన కుటుంబంలో అందరినీ హత్యలు చేసి, ఎలా ఎదిగారో’ అన్న విషయాన్ని ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే తరహాలో, కాంగ్రెస్‌లో కూడా అందరినీ అణగదొక్కి సీఎం పీఠం ఎక్కారని ఆరోపించారు. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా, కుట్రలు, కుతంత్రాలతో కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ పోయిన చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నదని విమర్శించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ను పబ్‌తో పోల్చిన సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్టులను సైతం అవమానించారని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. జర్నలిస్టులకు రేవంత్‌రెడ్డి తప్పకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్లబ్బులకు, పబ్బులకు వెళ్లే అలవాటు లేదన్న రేవంత్‌రెడ్డి గతంలో అదే ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రెస్‌క్లబ్‌లను పబ్బులంటూ ఎగతాళి చేసి, మాట్లాడిన సీఎం తీరును ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతల మాదిరిగానే జర్నలిస్టులను కూడా తొక్కుకుంటూ పోతానని రేవంత్‌రెడ్డి చెప్పకనే చెప్పారని దుయ్యబట్టారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కమ్యూనిస్టు నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
పేకాట క్లబ్బులు నడిపిన వారికి ప్రెస్‌క్లబ్ విలువ ఏం తెలుస్తుందని కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ క్లబ్లో కూడా ఆయనకు మెంబర్షిప్ ఉన్నదని గుర్తుచేశారు. బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టులే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారు తప్ప నిఖార్సయిన వార్తలు రాసే వారు సమర్థించరని స్పష్టంచేశారు. మహాన్యూస్ చానల్ ఘటనను ఖండించిన వారి నోళ్లు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఎందుకు మూగబోయాయని నిలదీశారు. సమావేశంలో ఆంజనేయగౌడ్, వాసుదేవరెడ్డి, రామచంద్రనాయక్, గెల్లు శ్రీనివాసయాదవ్, తుంగబాలు పాల్గొన్నారు.