హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఆమె స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు, బెదిరింపులు, అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మరో ట్వీట్లో అసెంబ్లీ సమావేశాల రోజు ప్రజాప్రతినిధులను ఎలా అరెస్టు చేస్తారని కవిత ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం రేవంత్ రెడ్డికి తమ గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వస్తున్న తాజా మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చి 15 నెలల్లో రూ.లక్షా యాబై వేల కోట్లు అప్పు చేసి, గ్రామ పంచాయతీలు, సర్పంచ్లకు పైసా కూడా ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి సర్పంచులను కలిసేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.