హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రైతుల సమస్యలపై గళమెత్తిన బాల్క సుమన్ గొంతునొక్కడం కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపునకు నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం నిండు అసెంబ్లీలో తొక్కుతా.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నరుకుతా, పేల్చేస్తా అని మాట్లాడారని పేర్కొన్నారు. కానీ, వారిని విస్మరించి సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం శోచనీయమన్నారు. రేవంత్ సర్కార్ నిరంకుశ విధానాలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
బాల్క సుమన్ అక్రమ అరెస్ట్ రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు, రైతుల సమస్యలపై గళమెత్తిన దళితనేత గొంతునొక్కడం దుర్మార్గమని ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం నేరమా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అని నిలదీశారు. వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కార్ అణచివేత చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, నిరంకుశ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
జగిత్యాల, మే 30 (నమస్తే తెలంగాణ) : నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చేస్తామనడం.. ఆ తరువాత అసెంబ్లీలో బట్టలూడదీస్తామని, లాగుల్లో తొండలు విడుస్తామంటూ వ్యాఖ్యలు చేశారని, ఆయన శిక్షార్హుడు కానప్పుడు, మాజీ ఎంపీ బాల సుమన్ ఏవిధంగా శిక్షార్హుడు అవుతాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిపై బాల సుమన్ మాటల ఉద్దేశం భవనాన్ని పేల్చివేయడం, కూల్చేయడం కాదని, సింగరేణిలో అవినీతిని తుడిచి వేయాలన్నదే ఆయన ఉద్దేశమని చెప్పారు. సింగరేణిలో అవినీతిని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టి నోళ్లు మూయిద్దామనుకుంటే అది సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యమేనని పేర్కొన్నారు. సీఎం పెట్టే తప్పుడు కేసులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని స్పష్టంచేశారు.
జనగామ, మే 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతూ, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల అవినీతి, కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రశ్నించినందుకే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి బాల సుమన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. సింగరేణి కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో సుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు కావాలనే వక్రీకరించి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. సుమన్‌పై కేసులను ఉపసంహరించుకొని, తక్షణమే విడుదల చేయాలని రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నదని మండలి విప్ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ‘నాడు రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ను పేల్చేస్తామని మాట్లాడితే భావ ప్రకటనా స్వేచ్ఛగా సమర్థించుకున్నరు.. నేడు ప్రజాసమస్యలపై బాల్క సుమన్ వ్యాఖ్యలు అందుకు విరుద్ధమా? రేవంత్‌కు ఓ న్యాయం.. సుమన్‌కు మరో న్యాయమా? ఇదేనా రేవంత్ సర్కార్ పాటిస్తున్న ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో నిర్బంధాలకు తావులేదని, సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, సుమన్‌పై అక్రమ కేసులను ఉపసంహరించుకొని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన బీఆర్ఎస్ దళిత నేతలపై రేవంత్ ప్రభుత్వం దుర్మార్గానికి ఒడిగడుతున్నదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధ్వజమెత్తారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసిన బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. వెంటనే సుమన్‌పై అక్రమ కేసులను ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై గళమెత్తిన బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నించడమే నేరమా? అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్పష్టంచేశారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో నిరంకుశ, అరాచక ప్రభుత్వం నడుస్తున్నదని కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బాల సుమన్‌పై కేసు, అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కక్షలో భాగమేనని ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను ప్రశ్నించిన బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూడటం ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. నిరంతరం విధ్వంసకర, విద్వేషపూరిత భాషతో మాట్లాడే సీఎం రేవంత్‌రెడ్డితో సహా అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయగలరా? అని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతల గొంతుతొక్కుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. ఇందులో భాగమే బాల్క సుమన్ అరెస్టు అని వ్యాఖ్యానించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడిన అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను విస్మరించి, సుమన్‌పై కక్ష సాధించడం బాధాకరమని పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతామని, ఊరూరా తిరిగి సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ సర్కార్ బనాయించే అక్రమ కేసులకు బీఆర్ఎస్ బెదరబోదని ఆ పార్టీ రాష్ట్ర నేత కిశోర్‌గౌడ్ తేల్చిచెప్పారు. నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బాల్క సుమన్‌పై ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని ఆరోపించారు. అక్రమ కేసులు, నిర్బంధాలు ఉద్యమపార్టీ అయిన బీఆర్ఎస్కు కొత్తకాదని స్పష్టంచేశారు. రేవంత్ సర్కార్ కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను పక్కనబెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్పై కక్ష సాధిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్‌కుమార్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి, నిరంకుశ పాలన తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ‘పండబెట్టి తొక్కుతా.. పేగులు మెడలో వేసుకుంటా’ అని మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి, ఫార్మా ఫ్యాక్టరీని పేల్చేస్తానని హెచ్చరికలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై అక్రమ కేసులు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసులు, కక్షలు పక్కనబెట్టి ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తీరు మార్చుకొకుంటే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.