AP News | కన్న కూతురిపై ప్రియుడు కన్నేయడం చూసి తట్టుకోలేకపోయింది. తన ముందే అఘాయిత్యం చేయడం చూసి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అతనిపై దాడి చేసింది. కత్తితో మర్మాంగాన్ని కోసింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం రూరల్ మండలం రాచనపల్లికి చెందిన ఆటోడ్రైవర్ సురేశ్‌కు స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇటీవల సునీత కుమార్తె మీద కూడా సురేశ్ కన్నేశాడు. కొద్దిరోజులగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మహిళ తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినప్పటికీ అతను పద్ధతి మార్చుకోలేదు. తన కూతురిపై ప్రియుడు వైఖరిని సహించుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే సురేశ్ రోజులాగే రాత్రి మహిళ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. అయినప్పటికీ సురేశ్ వదలకపోవడంతో ఆగ్రహానికి గురైంది. అదే ఆవేశంలో కూరగాయలు కోసే కత్తితో అతని మర్మాంగాన్ని కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సురేశ్ లబోదిబోమంటూ అక్కడే కుప్పకూలాడు. ఈ ఘటన అనంతరం సదరు మహిళ పోలీసులకు సమాచారం అందించి, స్థానికుల సాయంతో రక్తపు మడుగులో ఉన్న సురేశ్‌ను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం సురేశ్ పరిస్థితి నిలకడగా ఉంది.