BRS Party | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాలను అశాస్త్రీయంగా, అడ్డగోలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 17 నుంచి ఆందోళనలు చేపడుతామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జంటనగరాల ఉనికి లేకుండా, సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శనివారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానందగౌడ్, ముఠా గోపాల్, పార్టీ నేత పవన్‌కుమార్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు.
జంటనగరాల విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని చెప్పారు. అనంతరం మేధావులు, వివిధ సంఘాల నేతలు, విద్యార్థి నేతలతో చర్చించి రైలురోకో, ధర్నాలు, ర్యాలీలు చేపడుతామని వెల్లడించారు. ప్రజాపోరాటాలు ఉధృతం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. జంటనగరాలను 300 వార్డులుగా విభజిస్తున్నారని, కనీసం నగర మేయర్, డిప్యూటీ మేయర్‌కు కూడా తెలియకుండా చేయాల్సిన రహస్య ఎజెండా ఏమున్నదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ అంటే కంటోన్మెంట్, రాష్ట్రపతిభవన్, లష్కర్ బోనాలు అని చెప్పారు. సికింద్రాబాద్ పేరు లేకుండా ఇష్టానుసారంగా విభజిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటుచేయాలని తలసాని డిమాండ్‌చేశారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చాలి అని సవాల్ విసిరారు.
ఇలాంటి సీఎంను, స్పీకర్‌ను చూడలేదు..
ఎంతోమంది ముఖ్యమంత్రులను, స్పీకర్లను చూశాంగానీ, ఇలాంటి సీఎంను, స్పీకర్‌ను చూడలేదని తలసాని ఎద్దేవా చేశారు. గంటన్నరపాటు రేవంత్‌రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్నా స్పీకర్ అడ్డుచెప్పలేదని విమర్శించారు. స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడటం లేదని, తమను నిలువరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదని అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్తూనే.. తమ అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష సభ్యులుగా తాము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి తీరును విమర్శించాల్సి ఉంటుందని, మైక్ ఇవ్వను అని స్పీకర్ కరాఖండిగా చెప్పిప్పుడు ఇక హౌస్‌లో ఉండి ప్రయోజనమేమిటని, అందుకే సెషన్‌ను బహిష్కరించామని చెప్పారు.
పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం : వివేకానందగౌడ్
రాష్ట్రం పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని బీఆర్ఎస్ విప్ వివేకానందగౌడ్ విమర్శించారు. అవగాహనరాహిత్యంతో సీఎం తీసుకునే చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. సీఎంకు ఉదయం 11 గంటల వరకు ఇన్కమింగ్, ఆ తర్వాత ఔట్‌గోయింగ్, సాయంత్రం కౌంటింగ్ తప్ప ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. సీఎంకు కలెక్షన్ల మీద తప్ప దేనిమీద ధ్యాస లేదని విమర్శించారు.