BRS Party | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా, శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ సభలో దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించటమేనని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కేసీఆర్ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, వేల మంది ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ, అందుకు సంబంధించిన వీడియోల ను జతపరిచింది. ఈ మేరకు బీఆర్ఎస్ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. ఇదే ఫోన్‌ట్యాపింగ్ అంశంపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖపైనా చర్యలు తీసుకోవాలని మరో ఫిర్యాదును పంపింది.