హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్నారైల తరఫున ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చలు జరిపారు. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, పదేండ్ల పాలన మేళవింపు, ఏడాదిన్నరగా మళ్లీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంపై చర్చించారు.
అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న నిర్వహించే రజతోత్సవానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. అలాగే ఈ సంవత్సర కాలంలో వివిధ దేశాల్లో రజతోత్సవ వేడుకలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో నిర్వహించే ఈ వేడుకలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు.