Maganti Gopinath | సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గోపీనాథ్ భార్య, పిల్లలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్యల్సనాథ్ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ పార్థివదేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. మాగంటి కుమారుడిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు కే ఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్, పువ్వాడ అజయ్, భాస్కర్ రావు, పద్మారావు గౌడ్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నేతలు మాగంటి గోపీనాథ్ పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) ఆదివారం ఉదయం 5.45 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడిన గోపీనాథ్‌ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.