హైదరాబాద్‌లో విచ్చలవిడిగా నిర్మాణాలు ఉన్నయి.. అందుకే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) తెస్తున్నామని త్వరలోనే సీఎం రేవంత్ ప్రకటిస్తడు.. ఆ ప్రకటన రాగానే టీడీఆర్ పరిధి భూముల ధరలకు రెక్కలు వస్తయ్. ఇప్పటికే రేవంత్ వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు టీడీఆర్ పరిధిలో విచ్చలవిడిగా భూములు కొన్నరు. వేల కోట్లు కొల్లగొట్టేందుకు వాళ్లంతా కలిసి కుట్రకు తెరలేపిండ్రు. నేను చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకుంటే ముఖ్యమంత్రి వెంటనే శ్వేతప్రతం విడుదల చెయ్యాలె.
KTR | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ) : ట్రాన్స్ఫరెబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్)లో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ముగ్గురు, నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు హైదరాబాద్‌లో టీడీఆర్ పరిధి భూములను విచ్చలవిడిగా కొంటున్నారని వెల్లడించారు. నగరంలో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయని చెప్తూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) అమలు కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, దీనిపై ప్రకటన రాగానే టీడీఆర్ భూముల ధరలకు రెక్కలు వస్తాయని వెల్లడించారు. దీన్నే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారని, వేల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్, తన చుట్టూ ఉన్న రియల్ బ్రోకర్లు ఈ కుట్రకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్ సోమవారం నామినేషన్ వేయగా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, విజయుడు, ముఠాగోపాల్, దాసోజుతో కల్సి మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు.
తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు టీడీఆర్ విధానం తెచ్చామని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 400 ఎకరాల భూమిని సేకరించామని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ కలిపి టీడీఆర్ బ్యాంక్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీని ద్వారా ఈ మూడు సంస్థలు భూమిని పరస్పర అంగీకారంతో వినియోగించేలా వ్యవస్థను తయారు చేశామని స్పష్టం చేశారు. ఇప్పుడు దాదాపు లక్షల స్కేర్ ఫీట్ల భూములను రేవంత్‌రెడ్డి అనుచరులు కొనుగోలు చేశారని చెప్పారు. హైదరాబాద్‌లో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయని చెప్తూ ఎఫ్ఎస్ఐ నిబంధనలను అమల్లోకి తేబోతున్నట్టు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనో లేక బయటనో సీఎం ప్రకటిస్తారని తెలిపారు. ఈ ప్రకటన రాగానే టీడీఆర్ భూముల ధరలు పెరుగుతాయని వివరించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం టీడీఆర్ భూములు ఎంత? ఆరు నెలల కింద ఈ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయనే విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. లెక్క తీస్తే టీడీఆర్‌లు చేతులుమారిన వారి పేర్లు బయటకు వస్తాయన్నారు. ఈడీ, సీబీఐ విచారణ చేసేంత పెద్ద కుంభకోణం రాష్ట్రంలో జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డిని పొరపాటున కూడా బీజేపీ ముట్టుకోవడం లేదని విమర్శించారు. రెండేండ్ల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్‌కు అవకాశం ఇస్తే బీజేపీయే ఉద్దేశపూర్వకంగా ఆయన అభ్యర్థిత్వానికి అడ్డుపడిందని ఆరోపించారు. నాడు అడ్డుపడ్డ బీజేపీకి నేడు కేసీఆర్ తిరుగులేని సమాధానమిచ్చారని, దాసోజు విషయంలో ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని చెప్పారు.
వైఎస్సాఆర్ ప్రభుత్వం ఎఫ్ఎస్ఐని ఎత్తేసిందని, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడొద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలోనూ ఎఫ్ఎస్ఐని అమలు చేయలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. టీడీఆర్ భూముల కొనుగోళ్లు నెలలోనే 24 శాతం నుంచి 36 శాతానికి పెరిగాయని, మున్ముందు మరింత పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్‌లో విచ్చలవిడిగా నిర్మాణాలకు బీఆర్ఎస్ అనుమతులిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించే అవకాశాలూ లేకపోలేదన్నారు. అందుకే ఎఫ్ఎస్ఐ తెస్తున్నామని ముఖ్యమంత్రి అంటారని వెల్లడించారు. ఇలా కృత్రిమంగా టీడీఆర్ భూముల రేట్లు పెంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజనా దివాలా తీస్తున్నదని, ఇప్పటికే రూ.26 వేల కోట్ల లోటు ఉన్నదని, బడ్జెట్ ప్రవేశపెడితే రూ.40-50 వేల కోట్ల వరకు ఉంటుందని వాపోయారు. ఓ వైపు ప్రైవేట్ దోపిడీ పెరుగుతుంటే మరోవైపు ప్రభుత్వ రాబడి తగ్గుతున్నదని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ కారణంగానే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నదని చెప్పారు.
వైఎస్ హయాంలోనే ఎఫ్ఎస్ఐని వేసిండ్రు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడి లక్షలాది మందికి ఇబ్బందులు వస్తాయని బీఆర్ఎస్ హయాంలో కూడా ఎఫ్ఎస్ఐని అమలు చేయలేదు. కానీ టీడీఆర్ భూముల ధరలు పెంచుకొనేందుకు ఇప్పుడు ఎఫ్ఎస్ఐని మళ్లీ తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమైండు. రాష్ర్టానికి రెవెన్యూ పెంచాలనే ఆలోచన రేవంత్‌కు లేదు. ఎఫ్ఎస్ఐని సాకుగా చూపి బిల్డర్ల నుంచి మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తుడు.
– కేటీఆర్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారని కేటీఆర్ స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి సైతం హాజరవుతారని చెప్పారు. ‘కేసీఆర్ స్థాయి వేరు.. ఆయన స్థాయికి కాంగ్రెస్ నేతలు సరిపోరు.. కాంగ్రెస్ నేతలు మాట్లాడే పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు వినకూడదనేది కేసీఆర్ ఆలోచన’ అని వివరించారు. తాము ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషిస్తున్నామని, కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పాత్ర పోషించాలని సూచించారు. ఎండలకు పంటలు ఎండితే తనను తిడుతున్నారని సీఎం మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను ఎండబెట్టడం వల్లే గోదావరి పరీవాహక ప్రాంతం ఎండిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ ఏరియాలోని తుంగతుర్తి, సూర్యాపేటలో కేసీఆర్ హయాంలో టెయిలెండ్కు నీళ్లు వచ్చాయని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
అమృత్ స్కామ్‌లో నిరుడు జనవరి 29న ఓ టెండర్ రద్దయిందని, అదే రోజు హైదరాబాద్ సీఈవో ఆఫీసు నుంచి వరంగల్ ఎస్ఈకి సమాచారం అందందని కేటీఆర్ పేర్కొన్నారు. అదే రోజు కొత్త టెండర్ పిలిచి ఆగమేఘాల మీద ఫైనల్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎలాంటి అర్హతలు లేకున్నా కేవలం రూ.2 కోట్ల లాభాలున్న శోధ కన్స్ట్రక్షన్ కంపెనీకి రూ.1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు అప్పజెప్పారని విమర్శించారు. ఈ కంపెనీ రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్రెడ్డిన్నారు. దీనిపై అడిగితే కేంద్రంలోని బీజేపీ మౌనం వహించిందని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని బీజేపీ కాపాడటం ఏమిటని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి చేతిలో ఏమీ లేదని, ఆయన నిస్సాహాయుడని, తిట్టినా పడతారనేది రేవంత్‌రెడ్డి ఆలోచన అని విమర్శించారు. ‘కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించకపోవడంతోనే బీఆర్ఎస్ రాష్ర్టానికి నిధులు తేలేదని గతంలో రేవంత్ అన్నడు. మరి మోదీతో సత్సంబంధాలున్నా రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి’ అని నిలదీశారు. వరంగల్ ఎయిర్‌పోర్టు తమ కృషి అని రేవంత్ చెప్పుకొంటున్నారని, యుద్ధమంతా అయిపోయాక ఒకడొచ్చి చిన్న గాటు పెట్టుకుని తానే యుద్ధం చేసిన అన్న చందంగా రేవంత్ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ హయాంలో 6 ఎయిర్‌పోర్టులకు ప్రణాళికలు పంపి, భూ సేకరణ చేపట్టామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటోన్మెంట్లో భూ సేకరణ చేపడితే ఆ ఉత్తర్వులు తమ ఘనతేనని రేవంత్ గొప్పలు చెప్పుకొన్నారని దుయ్యబట్టారు. ఐఎంజీ కేసుపై తాము కొట్లాడితే ఆ భూములను సైతం రేవంత్ అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని, అందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని స్వయంగా రాహులే అన్నారని, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌ను ఆ పార్టీ హైకమాండ్ పక్కనపెట్టడంతో ఈ విషయం స్పష్టమైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు స్ట్రాంగ్ సెంట్రల్, వీక్ స్టేట్స్ను కోరుకుంటాయని, మొత్తం పగ్గాలు ఢిల్లీ చేతిలో ఉంచుకోవాలనే కుట్ర ఇందులో దాగుందని విమర్శించారు. ‘బీజేపీ హడావుడి సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నది.. సొసైటీలో తక్కువ ఉన్నది.. 15 నెలల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీజేపీ ఒక్క ప్రజా పోరాటమైనా ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
ఇండియా టుడే కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ తన దివాలాకోరు తనాన్ని బయటపెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు వాగ్దానాలిచ్చినప్పుడు సోయి లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్టులో నెలకు కడుతున్న వడ్డీ రూ.2 వేల కోట్లు అని చెప్పిందని.. సీఎం మాత్రం సిగ్గులేకుండా రూ.6,500 కోట్లు అని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాలకు సైతం ఇవ్వని లోన్లను ఇచ్చినట్టు చెప్పారని, ఇదే విషయాన్ని హరీశ్‌రావు లెక్కలతో సహా వెల్లడించారని గుర్తుచేశారు.
సీఎం రేవంత్ ప్రచారం చేసినా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉన్నదో ఈ ఫలితాలతో స్పష్టమైందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు, వైఎస్సాఆర్, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం చేశారా? అని ప్రశ్నించారు. పట్టభధ్రుల ఎన్నికల ప్రచారం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని, ప్రచారం చేసి మరీ అభాసుపాలయ్యారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు అన్నారు. దేశ రాజకీయాల్లో పార్టీ మార్పుల సంప్రదాయం తెచ్చిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు.
రాష్ట్ర బడ్జెట్ ఎలాగో అట్టర్ ఫ్లాప్ అవుతుందని, అందుకే ఈ కార్ రేస్ కేసును రేవంత్ తెరపైకి తేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల అటెన్షన్ డైవర్షన్ కోసం ఖచ్చితంగా ఈ నెల 16న ఈ కార్ కేసులో తనను విచారణకు పిలుస్తారని చెప్పారు. ఫార్ములా రేస్ కోసం రూ.46 కోట్లు ఖర్చు పెడితే తప్పంటున్న కాంగ్రెస్ నాయకులు, అందాల పోటీలకు రూ.200 కోట్లు ఎలా ఖర్చు పెడతారని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ఇండియా టుడే కాంక్లేవ్‌లో అన్నారని, అసలు ఒలింపిక్స్‌కు ఎంత ఖర్చవుతుందో ఆయనకు అవగాహన ఉన్నదా? అని ఎద్దేవాచేశారు. మిస్ వరల్డ్ పోటీలతో రూ.200 కోట్లు ఖర్చు చేస్తే రాష్ర్టానికి ఏం లాభమో చెప్పాలని ప్రశ్నించారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకు అంటగట్టడం ఏమిటని నిలదీశారు.
డీలిమిటేషన్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. దక్షిణాది రాష్ర్టాలన్నీ కలిపి మొత్తం 135 పార్లమెంట్ స్థానాలు ఉంటే.. ఒక్క యూపీలోనే ప్రస్తుతం 80 ఎంపీ స్థానాలు ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది ఎంపీ స్థానాలు 135 మాత్రమే ఉంటాయని కానీ యూపీలో మాత్రం 143 అవుతాయని చెప్పారు. మన సీట్లు తగ్గకున్నా వాళ్ల సీట్లు పెరగడంతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో తెలంగాణ జనాభా 2.8 శాతమని, జీడీపీలో కంట్రిబ్యూషన్ 5.1 శాతని చెప్పారు. దక్షిణాది 36 శాతం జీడీపీలో కంట్రిబ్యూషన్ చేస్తున్నదని, 19 శాతం జనాభా కలిగి ఉన్నదని వివరించారు. కుటుంబ నియంత్రణ కోసమని ‘మేమిద్దరం-మాకిద్దరం’ అనే నినాదాన్ని తీసుకొచ్చి కేంద్రం విస్తృతంగా ప్రచారం చేసిందని, పాటించినందుకు దక్షిణాదిపై పగ తీర్చుకుంటుందేమోనని ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సమావేశానికి సంబంధించి ఆహ్వానం అందిందని తెలిపారు.
‘కాంగ్రెస్ పాలకుల ఆంక్షల కంచెలను తెంచుకొని, నిర్బంధాలకు ఎదురొడ్డి చాటిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు అక్షరరూపం మిలియన్ మార్చ్’ అని కేటీఆర్ అభివర్ణించారు. అజరామర ఘట్టానికి 14 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఎక్స్‌వేదికగా నాటి ఉద్యమ మహోజ్వల సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. మిలియన్ మార్చ్‌లో తాను పాల్గొన్న సందర్భం, పోలీసులు అరెస్టు చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒకరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధనలో అసువులు బాసిన అమరులకు జోహార్లర్పించారు.
ముగ్గురు బీసీలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు దక్కడాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి కాంగ్రెస్ ఆ వర్గాన్ని మోసం చేస్తున్నదని, బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్ వద్ద సీఎం రేవంత్ ఆమరణ దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై మోదీ, రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో శాసనసభ, మండలిలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై తీర్మానించామని, 2021 అక్టోబర్ 9న జనగణన, కులగణన చేయాలని తీర్మానించామని గుర్తుచేశారు. అప్పటికి ఇంకా రాహుల్ మేల్కొనలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్ల పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పథకాల కోసం భూ సేకరణ, ఆస్తుల సేకరణ చేపట్టే సమయంలో జీహెచ్ఎంసీ టీడీఆర్ పత్రాలను అందజేస్తున్నది. అభివృద్ధి పనుల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు నాలా విస్తరణ కారణంగా ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో, అంతకు నాలుగు రెట్లు టీడీఆర్ పత్రాల రూపంలో పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్‌పేటలో 20 గజాల ఇల్లు కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా రూ.లక్ష ఇవ్వాల్సిన పరిస్థితుల్లో టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు, లేదా తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకోవచ్చు.