మల్యాల, జూలై 13 : అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. నేరుగా ఉద్యమకారుడికి ఫోన్ చేసి పరామర్శించడంతోపాటు హైదరాబాద్‌కు రప్పించి తన సొంత ఖర్చులతో చికిత్స చేయిస్తున్నారు. వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన క్యాతం శ్యాంసుందర్‌రెడ్డి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకారుడు. స్వరాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడంతోపాటు తెలంగాణ సాధించిన తరువాత బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ సోషల్ మీడియా వారియర్‌గా రాష్ట్రస్థాయిలో సేవలందిస్తున్నారు.
రాంపూర్‌లో కూరగాయలు సాగు చేసుకుంటూ జగిత్యాల రైతుబజార్లో విక్రయిస్తూ జీవనం సాగించే శ్యాంసుందర్‌రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరాడు. శ్యాంసుందర్ అనారోగ్యానికి గురయ్యాడని సోషల్ మీడియా వర్గాల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ స్వయంగా శ్యాంసుందర్‌తో ఫోన్లో మాట్లాడారు. చికిత్సకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని భరోసా కల్పించారు.
హైదరాబాద్‌లో చికిత్స అందేలా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్ని రకాలుగా అందుబాటులో ఉంటారని, వెంటనే హైదరాబాద్ రావాలని శ్యాంసుందర్‌కు కేసీఆర్ సూచించారు. కోరుట్ల ఎమ్మెల్యే నేతృత్వంలో శ్యాంసుందర్‌ను జగిత్యాల దవాఖాన నుంచి శనివారం రాత్రి అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోదకు తరలించారు. ఆ వెంటనే కేసీఆర్ కోరుట్ల ఎమ్మెల్యేకు ఫోన్ చేసి శ్యాంసుందర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆపద కాలంలో కార్యకర్తకు అండగా ఉండటంతోపాటు వారి కుటుంబానికి భరోసా కల్పించాలని కేసీఆర్ ఎమ్మెల్యేకు సూచించినట్టు సమాచారం.