KCR | హైదరాబాద్ : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు కాటేయబోతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాటేయడం ఖాయం.. అందులో ఎలాంటి అనుమానం లేదు.. ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 రోజుల బస్సు యాత్ర చేపట్టాను. ఆ తర్వాత జనం నుంచి వచ్చిన స్పందనలు, మధ్యాహ్నాం సమయంలో జనం ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తున్నది ఏందంటే ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను మించి ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ అద్భుతంగా గెలవబోతుంది. ఇందులో సందేహం లేదు. ఈ రెండు ప్రభుత్వాల ఆచరణ, అవలంభించిన తప్పుడు విధానాలు ప్రజల్లోకి వెళ్లాయి. వాటిని మేం చెప్పగలిగాం. దాని ఫలితమే బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించబోతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అర్భక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. ఎప్పుడు కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం కొలువు దీరినప్పుడు గత ప్రభుత్వం ఏ విధానాలో అవలంభించిందో ఇంటర్నల్ సమీక్షలు చేసి మెరుగైన పనితనం చూపించాలి. ఇది సహజంగా కనిపించేదే. భిన్నంగా అసహజమైన పద్ధతుల్లో ఒక పాలసీ లేకుండా, రైతులు, ఇండస్ట్రీ, పవర్, ఇరిగేషన్ సెక్టార్‌ను పక్కన పెట్టి అమూల్యమైన సమయాన్ని చిల్లర రాజకీయాల కోసం వేస్ట్ చేశారు. శాసనసభలో కూడా చిలిపి ప్రయత్నాలు చేశారు. శ్వేత పత్రాలు విడుదల చేసి, చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తులనాడటం, మాట్లాడని భాష మాట్లాడి ఒక అక్కసు వెల్లగక్కి ప్రతిపక్షాన్ని దెబ్బతీసే చిల్లర రాజకీయ ప్రయత్నానికి పాల్పడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై అతి తక్కువ దృష్టి పెట్టారు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతుంది. వారు చేసిన తప్పే వారిని కాటేయబోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాంతో పార్టీని ముంచేయడం ఖాయం అని కేసీఆర్ అన్నారు.
సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. జాతీయ పార్టీల ఓటమి స్పష్టంగా కనబుడుతుంది. అధికారంలో ఉండే పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ వస్తే సరూర్‌నగర్ స్టేడియంలో ఎంత అభాసుపాలు అయ్యారో చూశాం. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల సంయుక్త సమావేశంలో 3 వేల మందిని సమీకరించలేకపోయారు. రాహుల్ గాంధీ బస్సులోనే కూర్చోవడం సీఎం బతిమాలికోవడం చూశాం. వచ్చిన డీసీఎంలలో జనాలను తొందరగా స్టేడియంలోకి పంపించడం జరిగింది. అది కూడా చూశాం. కాంగ్రెస్ ఓటమికి ఇది స్పష్టమైన సంకేతం. అగ్ర నాయకుడు వచ్చినప్పుడు సీఎం సభల్లో ఇబ్బడిముబ్బడిగా కుర్చీలు ఖాళీగా ఉండంటం సంకేతం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న జోష్ కొరవడింది. ప్రజాస్పందన శూన్యంగా ఉంది అని కేసీఆర్ పేర్కొన్నారు.