హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలైన సమ్మక్క, సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ చెప్పారు. కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో.. మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతున్నదని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో ప్రగతి మళ్లీ పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.