KCR | వరంగల్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలకుల జలదోపిడీపై ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాడు ఎక్కడైతే సమరశంఖాన్ని పూరించారో.. ఇప్పుడూ అక్కడినుంచే యుద్ధభేరి మోగించనున్నారు. నాడు జోగులాంబకు ప్రణమిల్లి పాలమూరు వలస బతుకులకు చెరమగీతం పాడుతానని ప్రతినబూనారు. అన్నట్టుగానే రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైన తరువాత అహోరాత్రులు కష్టపడి అదే పాలమూరులో రివర్స్ వలసలను ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు దత్తపుత్రుడినని ఊదరగొట్టిన చంద్రబాబుకు ఏ రీతిలో ఉద్యమ రుచి చూపించారో, ఇప్పుడు నల్లమల పులిబిడ్డనని చెప్పుకుంటున్న ఆ గురువుకు శిష్యుడు పాలమూరు తలరాతను శాశ్వతంగా చీకటి చేయాలని చూస్తుంటే రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. నాడు గురువు.. నేడు శిష్యుడు.. పాలమూరు బతుకును బుగ్గిపాలు చేస్తే ఊరుకోబోమని, ఎక్కడ ఆగిందో అక్కడినుంచే పోరాటం మొదలవుతుందని ఆదివారం తెలంగాణభవన్ సాక్షిగా అల్టిమేటమ్ జారీచేశారు.
నాడు జోగులాంబకు ప్రణమిల్లి..
తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తొలినాళ్లలో 2003 మే 20వ తేదీన ఆలంపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన కేసీఆర్.. మే 25న గద్వాలకు చేరారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఆ పాదయాత్ర సంచలనమైంది. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారు ఉద్యమ నాయకుడిని దీవించింది. సుదీర్ఘకాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. రాష్ట్రం సాకారమైన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. ఉమ్మడి పాలమూరు రూపురేఖలను మార్చేశారు. పడావు పడ్డ భూముల్లో పసిడి సిరులు కురిపించారు. పాలమూరు నేలతల్లికి పట్టుపీతాంబరం కట్టారు. ఉమ్మడి పాలకుల కుట్రలకు పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో జమైన బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేశారు. ఫలితంగా ఒక్క పాలమూరులోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు. కృష్ణా నదిలో న్యాయంగా పాలమూరుకు రావాల్సిన వాటాను ఒడిసిపట్టుకునేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 90% పూర్తిచేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. వడ్డించిన విస్తరిలా పాలమూరును సిద్ధం చేస్తే, రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ విస్తరిని నేలపాలు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితిపై కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఉద్యమకాలంలో నాడు ఎక్కడినుంచి పాదయాత్ర మొదలుపెట్టారో ఇప్పుడూ అదే పాలమూరు నుంచి పోరుపతాకను ఎగురవేస్తుండటం విశేషం.
పాలమూరుపై మళ్లీ ఉద్యమ పొద్దు
పాలమూరుపై మళ్లీ ఉద్యమపొద్దు పొడవబోతున్నది. రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా ఫణంగా పెట్టే నిర్ణయాలు తీసుకోవడం, తెలంగాణ హక్కులను శాశ్వతంగా కృష్ణాలో కలిపేసే ప్రయత్నాలు జరగుతుండటంతో ఇలాగే ఉపేక్షిస్తే, అసలుకే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్ ప్రజాచైతన్య కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
దాదాపు నెలరోజులపాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో నాటి జలసాధన ఉద్యమాన్ని తలపించేవిధంగా జలపోరాట కార్యాచరణను ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన సమావేశంలో సిద్ధం చేసినట్టు స్పష్టమవుతున్నది. ఊరూర ఉద్యమ దండోరా మోగించడం, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, తద్వారా కృష్ణాబేసిన్ ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించడం, రేవంత్‌రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టుపెడుతున్నదో, తెలంగాణ శాశ్వత హక్కులను ఎలా గంగపాలు చేస్తున్నదో ప్రజలకు అర్థమయ్యేలా ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కేసీఆర్ మాటలతో స్పష్టమైంది. మొత్తానికి అప్పుడూ, ఇప్పుడూ అదే పాలమూరు నేలతల్లికి జలాభిషేకం చేసేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతుండటం విశేషం.