KCR | గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం సక్కగుందని ప్రశ్నించారు. అందుకే కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి అని జీవన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్నారని తెలిపారు. వాళ్ల నోటి నుంచి వట్టిగానే ఆ మాట వస్తదా.. బాధ్యత లేకుండానే వస్తదా అని ప్రశ్నించారు. ఏం చూసినా సక్కగా లేకపోతే.. పొద్దున లేస్తే దోపిడి తప్ప ఇంకోటి లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని అడిగారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం.. ఉద్యోగస్తులు ఆగం.. రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆగం.. విద్యార్థుల జీవితం ఆగం.. ఆటో కార్మికుల జీవితాలు ఆగం.. ఎవరు సక్కగున్నరు అని కేసీఆర్ అడిగారు. సంతృప్తిగా ఎవరున్నారని అన్నారు. ఈ అందానికి బోడి ముండ హైడ్రాను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా ఉందని.. నిజామాబాద్‌కు నిడ్రా తీసుకొస్తామని పీసీసీ ప్రెసిడెంట్ ఒకరు చెబుతున్నారని మండిపడ్డారు. రేపు జగిత్యాలకు జిడ్రా అంటాడని సెటైర్ వేశారు. మీకేం కావాలి.. పేదోళ్ల కొంపలు కూల్చడమేనా అని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వంలో మూడున్నర లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలిచ్చామని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ ఇవాళ ఏం కూలగొడుతున్నారని మండిపడ్డారు. పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనివ్వరా.. అంత ఎగిర్తమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని హామీ ఇచ్చారు. మొదటి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పడేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 46వేల చెరువులు మంచిగా చేశామని.. కానీ ఒక్క గుడిసె కూడా కూలగొట్టలేదని స్పష్టం చేశారు.
మూసీ అని గరీబోళ్లను ఏడిపిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పొద్దున లేస్తే నిద్రపోకుండా, వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 వేల ఇళ్లు కూలగొడతామని అంటున్నారని.. అది ధర్మమేనా అని ప్రశ్నించారు. మూసీని మంచిగ చేయాల్సిందేనని.. కానీ ఇళ్లు కూలగొట్టుడు ఎందుకని నిలదీశారు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప అందులో ఏమీ లేదని అన్నారు. ఈజీగా చేయగలిగిన దాన్ని నాశనం పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏది చూసినా కూడా ఒకరకమైన దోపిడీ, ఒకరకమైన గుండాగిరి, అరాచకంతో ముందుకెళ్తున్నారే తప్ప.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టిండ్రని.. ఏం రోగమని కేసీఆర్ ప్రశ్నించారు.