మనకు తెలంగాణ అంటే ఒక టాస్.. ఇతరులకు అది పొలిటికల్ గేమ్.. రాజకీయ కోణం పకన పెడితే, తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ శ్రేణులకు ఉండే చిత్తశుద్ధి మరెవరికీ ఉండదు. 15 ఏండ్లు రాష్ట్రం కోసం కొట్లాడిన బిడ్డలుగా, పదేండ్లపాటు రాష్ట్ర ప్రగతి కోసం తండ్లాడిన బిడ్డలుగా ప్రజల సంక్షేమం పట్ల మనకే కడుపు నొప్పి ఉంటది. నిత్యం ప్రజల నడుమ ఉంటూ వారి సమస్యల పరిషారానికి కృషి చేయండి.
తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కేవలం తెలంగాణ విద్యార్థులే చదువుకోరు. వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటరు. అంతటి ఖ్యాతి గడించిన హెచ్‌సీయూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు. అధికారం ఉన్నదని నోటికొచ్చినట్టు మాట్లాడి, ఇష్టమొచ్చిన్నట్టు వ్యవహరిస్తే అటు న్యాయస్థానాలు, ఇటు సభ్యసమాజం, విద్యార్థిలోకం తిప్పికొడుతయి.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతి భేష్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభినందించారు. విశ్వఖ్యాతి గడించిన హెచ్‌సీయూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ తప్పుబట్టారు. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులను అభినందించారు. అధికారం చేతిలో ఉన్నదని ఇష్టమొచ్చినట్టు చేస్తే అటు న్యాయస్థానాలు, ఇటు సభ్యసమాజం, విద్యార్థిలోకం తిప్పికొడతాయని, ఇందుకు హెచ్‌సీయూ ఘటననే గుణపాఠంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవుపలికారు. ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడితే దాన్ని నిలుపుకోవడం చేతగాక, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. తెలంగాణ బాగోగుల పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఉన్నంత ఆవేదన, స్పృహ మరే ఇతర పార్టీకి ఉండదని పునరుద్ఘాటించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్ఫూర్తి బీఆర్ఎస్ సొంతమని స్పష్టం చేశారు. దశాబ్దాలపాటు పోరాటాలు చేసి నిరాశానిసృ్పహల్లో కూరుకుపోయిన తెలంగాణ సమాజంలో స్వరాష్ట్ర చైతన్యాన్ని నింపి, రాష్ట్ర సాధనకోసం శాంతియుత పంథాలో ప్రజాపోరాటాలు నడిపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులదేనని తేల్చిచెప్పారు. తెలంగాణ సాధన తర్వాత ప్రజలు ఇచ్చిన ఆదరణతో తొమ్మిదిన్నరేండ్లు రాష్ర్టాన్ని జనరంజకంగా పాలించి, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ స్ఫూర్తితో సాగించిన బీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. వ్యవసాయంతోపాటు సమస్త రంగాలు, సర్వవృత్తులు, సబ్బండ కులాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవ మహోన్నతమైనదని చెప్పారు. అంతటి చిత్తశుద్ధితో, పట్టుదలతో ప్రజలే కేంద్రంగా వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం ఒక బీఆర్ఎస్కే సాధ్యమని పేర్కొన్నారు. తాము కోల్పోయిందేమిటో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన ద్వారా ప్రజల అనుభవంలోకి వచ్చిందని చెప్పారు.
వారం రోజులుగా సన్నాహక సమావేశాలు
బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెల 27న వరంగల్ జిల్లాలో పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించి, ఆ దిశగా చర్యలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్యనేతలతో వారం నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వరంగల్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. శనివారం ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలతో అధినేత సమావేశమయ్యారు. రజతోత్సవ సభను విజయవంతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
చివరి రోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, సీహెచ్ లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ ఆంజనేయగౌడ్, హనుమంతునాయుడు, గట్టు యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా నేతలు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బానోత్ మదన్‌లాల్, బానోత్ హరిప్రియనాయక్, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వర్రావు, వనం వేంకటేశ్వర్రావు, లింగాల కమల్‌రాజ్ హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాసర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్, పార్టీ సీనియర్ నేత విజయ సింహారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులు : అధినేతకు వివరించిన నేతలు
రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్తు, సాగునీటి సరఫరా, తాగునీరు వంటి మౌలిక వసతుల గురించి అధినేత కేసీఆర్ ఆరాతీశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు నష్టాల గురించి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత గురించి, ప్రజల మనోవేదనను వారం రోజులుగా సాగిన సమావేశాల్లో అధినేతకు పార్టీ నేతలు వివరించారు. సాగునీటి కాల్వల్లో కేసీఆర్ నీళ్లు రావట్లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నడి ఎండకాలంలో నిండుకుండల్లా మత్తడి దుంకిన చెరువులు, కుంటలు ఇప్పుడు కనీసం మూగజీవాల దాహం కూడా తీర్చలేని విధంగా పూర్తిగా ఎండిపోయాయని వివరించారు. ఇన్నాళ్లు పుషలంగా రెండించుల పైపు నిండా నీళ్ల్లు పోసిన వ్యవసాయ బోర్లు వట్టిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సాగునీరు అందుతుందనే ఆశతో యాసంగి వరి నాట్లు వేసుకున్న రైతులు, తీరా నీరందరక పొట్టకొచ్చిన పొలాలను పశువుల మేతకు వదిలేసుకున్న దయనీయ పరిస్థితులను ఏకరువుపెట్టారు.
గ్రామాల్లో పాలన కుంటుపడిందని, కనీసం డీజిల్ కూడా లేక ట్రాక్టర్లు మూలకుపడ్డాయని, సఫాయి కార్మికులకు జీతాలు లేక పారిశుధ్యం పడకేసిందని వాపోయారు. కేవలం అధికారం కోసమే అలవిగాని హామీలిచ్చి, కనిపించిన దేవునిమీదల్లా ఒట్లు పెట్టి బూటకపు గ్యారెంటీలతో ప్రజలను నమ్మించిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఏమీ చేయకపోగా చేస్తున్నట్టు మభ్యపెడుతుండటంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. అలవిగాని ఆశలను కల్పించి తీరా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలను కూడా ఆపేస్తుండడంతో ప్రజలు రాష్ట్ర సర్కారుపై భగ్గుమంటున్నారనే విషయాన్ని ఉదాహరణలతో సహా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఈ అంశాల్లో ఇప్పటికే సమాచారం అందుతున్నదని చెప్పిన కేసీఆర్, ప్రభుత్వ అసమర్థత మూలంగా రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలుతో దేశ ప్రగతికి రాష్ట్ర ఆర్థిక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా పరిఢవిల్లిన తెలంగాణ పల్లెలు, నేడు కనీస ఆదరణ లేక కునారిల్లుతున్నాయని విచారం వ్యక్తంచేశారు.
అప్పుడెట్లుండె.. ఇప్పుడెందుకు లేదు?
తెలంగాణ సాధన అనంతరం కొత్త రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పాదకత, సరఫరా దయనీయ పరిస్థితిని తలుచుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తాను ఒక ముఖ్యమంత్రిగా వాటిని అధిగమించిన తీరును, అందుకు సహనంతో తాను తీసుకున్న నిర్ణయాలను కార్యాచరణను పార్టీ నేతలకు వివరించారు. ‘రాష్ట్రం ఎకడబోతేంది?.. ప్రజలేమయితేంది? తమ స్వార్థ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిండ్రు. మనం ఉద్యమం మొదలు పెట్టి తెలంగాణను సాధించి అనంతరం ఎన్నికల్లో ప్రజల సహకారం, ఆదరణతో కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్ననాడు అన్ని రంగాల్లో అంధకార పరిస్థితులుండేవి. ముఖ్యంగా విద్యుత్తు రంగం అగమ్యగోచరంగా ఉండే. ఆనాటికి తెలంగాణకు నేషనల్ గ్రిడ్ అనుసంధానం లేదు. మనకు కరెంటు తకువ పడితే ఇతర రాష్ర్టాల నుంచి తీసుకోవడానికి గ్రిడ్ అవసరం. అటువంటి పరిస్థితుల్లో నాటి విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది కృషితో ప్రభుత్వ పట్టుదలతో, తొమ్మిది నెలల అనతికాలంలోనే నేషనల్ గ్రిడ్ నిర్మాణం చేసుకుని రాష్ర్టాన్ని కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించుకున్నం. క్రమక్రమంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తును, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందుబాటులోకి తెచ్చుకున్నం. ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే.. తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల, వ్యవసాయాభివృద్ధి పట్ల ఉద్యమ.. ఇంటి పార్టీ బీఆర్ఎస్కు ఉన్న ప్రేమ, అభిమానమే కారణం’ అని కేసీఆర్ వివరించారు.
16
నేడు మనల్ని బద్నాంచేయాలని చూస్తున్నరు
కొత్త తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనను విఫలం చెందించి తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయోగంగా నిరూపించే కుయుక్తులను నాటి తెలంగాణ వ్యతిరేక శక్తులు మూకుమ్మడిగా అమలు చేశాయని కేసీఆర్ గుర్తుచేశారు. వాటిని తాను అప్రమత్తతతో తిప్పికొట్టడం ద్వారా తోకముడుచుకున్నాయని చెప్పారు. నాటి ప్రతీప శక్తులు, తిరిగి ప్రజల్లో మోసపూరిత వాగ్దానాలతో ఆశలు రేకిత్తించి అధికారం చేజికించుకున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వీరు ప్రజలకు పాలనను అందించడం చేతగాక తిరిగి బీఆర్ఎస్ పాలనను తప్పుపడుతూ మనలనే నిందించే కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ప్రజలను అత్యాశలకు గురిచేసి వాటిని తీర్చడం చేతగాక బీఆర్ఎస్ను ఆడిపోసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘వీళ్లిట్ల్లనే ఇంకా దిగజారి వ్యవహరిస్తుంటరు. మన పార్టీ నేతలు ఆవేశానికి గురికావద్దు. మనలను ప్రజా సమస్యల నుంచి దృష్టిమళ్లించే కుయుక్తులను ప్రజలు అర్థం చేసుకుంటున్నరు’ అని తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమలేని వీళ్ల స్వార్థపూరిత రాజకీయాలను, అత్యాశతో కూడుకున్న అవినీతి ఆలోచనా విధానాలను, క్షేత్రస్థాయిలో ప్రజలు అర్థం చేసుకొని తిప్పికొడుతున్నారని వివరించారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఇంటి పార్టీ అని, అదే శ్రీరామ రక్ష అని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.
కుల వృత్తులకు బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగం
తెలంగాణలో కుల వృత్తులకు బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగంగా ఉన్నదని కేసీఆర్ గుర్తుచేశారు. ‘యాదవుల నుంచి గొర్రెపిల్లను తీసుకొని దావత్ చేసుకున్న ప్రజాప్రతినిధులను గతంలో చూసినం.. యాదవులకే గొర్రె పిల్లనిచ్చి కులవృత్తిని ఆదుకున్న ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో మీరే (బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు)’ అని చెప్పారు. రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక ప్రభుత్వాల దాకా రైతుల దగ్గర భూమి శిస్తు వసూలు చేశారని, కానీ, రైతులకు తిరిగి పంట పెట్టుబడి అందించించిన మొట్టమొదటి ప్రభుత్వం.. బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. ఎమ్మార్వో నుంచి సీసీఎల్యే దాకా ఐదారుగురు యజమానులుండే రైతు భూములను, ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి విడిపించి రైతు భూముల మీద రైతునే సర్వ హకుదారుగా చేశామని చెప్పారు. ‘నీ బొటన వేలు పెడితే తప్ప నీ భూమి ఇంకొకరికి మారని విధంగా ధరణి ద్వారా రక్షణ కల్పించినం’ అని కేసీఆర్ గుర్తుచేశారు. వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని ధీమా వ్యక్తంచేశారు. కార్యకర్తలతోపాటు సభకు తరలివచ్చే ప్రజల కోసం తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలను, చర్యలను జిల్లా నేతలకు వివరించారు.
సభ అనంతరం సభ్యత్వ నమోదు
ఈ నెల 27న వరంగల్‌లో రజతోత్సవ సభ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించాలని వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణం చేపడుతామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో, పార్టీ సీనియర్లతో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పాలనాపరమైన రంగాల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఆయా అంశాలపై అర్థమయ్యే రీతిలో కార్యకర్తలకు అద్భుతమైన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతుల సందర్భంగా రాష్ట్రం, దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.
7 వేల మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు..రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 7 వేల మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని 20 వేల మెగావాట్లకు పెంచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ స్పష్టంచేశారు. 20 వేల మెగావాట్లకు తోడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషితో అందుబాటులోకి మరో 2,400 మెగావాట్ల విద్యుత్తు వచ్చిందని చెప్పారు. ఎన్నికల అనంతరం అదనపు విద్యుత్తు అందుబాటులోకి వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎందుకు అందించలేక పోతున్నదో అర్థం కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనే అని మండిపడ్డారు.‘కనీసం సర్పంచైనా తాను పదవిలోకి వచ్చినంక ప్రజలచేత మంచి అనిపించుకోవాలనుకుంటడు. సర్పంచే కాదు ప్రతి మనిషీ తనకు సేవ చేసే అవకాశం వస్తే ప్రజలచేత శభాష్ అనిపించుకోవాలని చూస్తడు.. కానీ, ప్రతి నిర్ణయం ద్వారా ప్రజలతో ఛీతారాలకు గురవ్వడం తప్పితే ఒక పనిచేసి కూడా ప్రజలచేత మంచి అనిపించుకోకపోవడం, ఆ సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం’ అని కేసీఆర్ విమర్శించారు. రైతుల పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల అభిమానం ఉంటే, పాలన ప్రాధాన్యతలు అర్థమవుతాయని, తద్వారా యంత్రాంగం మీద పట్టుసాధించి ప్రజల సంక్షేమం కోసం రాజీపడకుండా పాలన అందించగలుగుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ధి, పట్టుదల లోపించడం మూలంగానే, రాష్ట్రంలో విద్యుత్తు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పన దుర్లభంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతి ఊరిలో గులాబీ జెండా ఎగరేసి బయలుదేరాలి
రజతోత్సవ సభకు బయలుదేరే ముందు ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగరేసి ప్రయాణం కావాలని, ఇదే విషయాన్ని కార్యకర్తలకు తెలియజేయాలని కేసీఆర్ సూచించారు. కార్యకర్తలకు సరిపడా జెండాలు, కండువాలు, పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి పంపిణీ అవుతుందని చెప్పారు. సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలను పటిష్టంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 27న వరంగల్‌లో సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిద్దాం. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు వేసుకుందాం. పార్టీ జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తం. పలు రంగాల ప్రముఖులు, పార్టీ సీనియర్లతో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పాలనాపరమైన రంగాల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటయి. ఆయా అంశాలపై అర్థమయ్యే రీతిలో కార్యకర్తలకు అద్భుతమైన శిక్షణ ఇప్పిస్తం. శిక్షణ తరగతుల సందర్భంగా రాష్ట్రం, దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద చర్చలు ఉంటయి.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమలేని వీళ్ల స్వార్థపూరిత రాజకీయాలను, అత్యాశతో కూడుకున్న అవినీతి, ఆలోచనా విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలు అర్థం చేసుకొని తిప్పికొడుతున్నరు. తెలంగాణకు బీఆర్ఎస్ ఇంటి పార్టీ అని, అదే శ్రీరామ రక్ష అని అర్థం చేసుకున్నరు. వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తరు.
-బీఆర్ఎస్ అధినేత కేసీఆర్