KCR | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీపై యుద్ధభేరి మోగించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు, రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని, వైఫల్యాలను ఎండగట్టారు. ఈ రెండు పార్టీలకు తెలంగాణను పరిపాలించే హక్కు లేదని, ఇక్కడ ఆ పార్టీలకు చోటు లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు. అగ్రపథంలో ఉన్న తెలంగాణను అధోగతిపాలు చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఎగ్గొట్టడంపై మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ సర్కారు ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కారు సృష్టిస్తున్న విధ్వంపై ధ్వజమెత్తారు. బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటూ ఢిల్లీకి సంచులు మోస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కూడా నిప్పులు చెరిగారు. తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచారు. పదకొండేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు 11 రూపాయలైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించి, అవమానించిన వారు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విధంగా ఈ రెండు పార్టీలు తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై సవివరింగా చెప్పారు. భవిష్యత్‌పై బాగా ఆ లోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజల కు సూచించారు. రాష్ర్టానికి ఏ పార్టీతో మేలు జరుగుతుందో ఆలోచించాలని కోరారు.