హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలను సృష్టిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల అవి ఎండిపోయి ఎడారులుగా మారాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరెంటు కోతలు, ఎండిపోయిన పంటలు, కాలిపోయిన మోటర్లు, బిందెల కొట్లాటలు.. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2014కు ముందు పరిస్థితులు పునరావృతం అయ్యాయని చెప్పారు. ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్ శుక్రవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నీటి నిర్వహణలో ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. ‘నీళ్లు వదలాలని ముందే చెప్పొచ్చుకదా..’ అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రివి నువ్వా..? నేనా..? అని ప్రశ్నించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
నేను, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, నాటి గవర్నర్ నరసింహన్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత కరీంనగర్‌కు వచ్చి మీడియా సమావేశం నిర్వహించాను. ‘కాళేశ్వరం పూర్తయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు ఇక ఢోకా ఉండదు. ఉమ్మడి జిల్లాలో నాలుగు సజీవ జలధారలు ఉంటయి. అవి నిరంతరం ఈ జిల్లాను కాపాడుతయి’ అని చెప్పిన. ఆ సజీవ జలధారలను మేమే సృష్టించినం. యావత్ జిల్లా ప్రజలు వాటిని కండ్లారా చూశారు, వాటి ఫలితాన్ని అనుభవించారు.
1) మానేరు వాగు: అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలై అన్నారం బరాజ్ దగ్గర గోదావరిలో కలిసేవరకు చెక్‌డ్యామ్‌లు, ఇంటర్మీడియన్ డ్యామ్‌లు నిరంతరం కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతూ ఉంటాయని చెప్పిన.
2) వరద కాలువ: దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను పూర్తి చేయడమే కాకుండా.. శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం పేరుతో వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చినం. సంవత్సరం పొడవునా 1.50 టీఎంసీల నీళ్లు ఉండేటట్టు చేసినం.
మొన్న సూర్యాపేట నుంచి నేను బయలుదేరిన. ఇప్పటి వరకు మూడు కాల్వలకు నీళ్లొదిలినరు. ఈ తెలివి ముందెటుపోయింది? ఎందుకు నీళ్లు వదలలేదు, ఎందుకు వేల ఎకరాల పంటలు ఎండగొట్టిండ్రు? 20 -25 రోజులు ముందు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదిలి ఉంటే వేల ఎకరాల్లో ఒక తడి కోసం వేచిచూసిన పంట ఎండిపోకపోయేది. వరదకాల్వ కింద 20 -25 రోజుల కింద నీళ్లు వదిలి ఉంటే గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల పంట బతికేది.
3) కాకతీయ కాలువ : సంవత్సరంలో దాదాపు 10 నెలలు నిండు గర్భిణిలా ప్రవహించే కాలువ.
4) 200 కిలోమీటర్ల సజీవ నది: గోదావరి మీద నిర్మించిన బరాజ్‌లు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, ఎస్సారెస్పీ పునర్జీవం వంటివాటి ద్వారా గోదావరి నది 200 కిలోమీటర్ల పొడవున నిండు జలాలతో మారిన సజీవ అమృత ధార.
ఈ నాలుగు ధారలు ఏ విధంగా నిండి ఉండెనో.. ఐదారేండ్లుగా వాటి ఫలితాలను ఏవిధంగా అనుభవించారో యావత్ ప్రజానీకానికి తెలుసు. ఇన్ని జలధారలు సృష్టించబడి, చక్కని ఫలితాలు లభించి, లక్షల టన్నుల ధాన్యం పండించి, పుష్కలంగా మంచినీరు అనుభవించిన కరీంనగర్ జిల్లా ప్రజలు.. నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతున్నదో చూస్తున్నరు. అవన్నీ ఎడారులుగా మారిపోయినయి. ఒకప్పుడు మిడ్ మానేరు బ్రిడ్జీ మీద నిలుచుంటే సముద్రం మధ్యలో నిలబడినట్టు అనిపించేది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. మునిగిపోయిన ఊర్లు, చెట్లు తేలినయి. ఒక శ్మశానం మాదిరిగా, ఎడారిలా తయారుచేశారు. లోయర్ మానేరు డ్యామ్‌లో మే నెల తర్వాత కూడా సగం నీళ్లు నిండి ఉంటుండే. కరీంనగర్, సిద్దిపేట వంటి అనేక పట్టణాలకు రోజూ కావాల్సినన్ని నీళ్లు ఇచ్చింది. నేను ఈరోజు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానికి వెళ్తే.. అక్కడ కరీంనగర్ మేయర్, కార్పొరేటర్లు, ప్రజలు మాట్లాడినరు. ‘గతంలో రోజూ నీళ్లు వచ్చేవి, ఇప్పుడు రోజు తప్పి రోజు వస్తున్నయి, ఇంకొన్ని రోజులైతే మూడునాలుగు రోజులు అంటున్నరు.. భయమైతున్నది’ అని అన్నారు.
ఇయ్యాల తెలంగాణలో పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటర్లు కాలని జిల్లా లేదు. పాత తెలంగాణ మల్లా పునరావృతం అయ్యింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలిచ్చినట్టు ఉన్నది ప్రజల పరిస్థితి. నీటి నిర్వహణ సామర్థ్యం తెలియని లత్కోర్లు రాజ్యమేలుతున్నరు కాబట్టి.. అసమర్థులు, చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నరు కాబట్టి ఇయ్యాల ఈ పరిస్థితి సంభవించింది.
ప్రభుత్వ తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల రాష్ర్టానికి ఈ దరిద్రం వచ్చింది. ఒక్కటే మాటలో చెప్పాలంటే.. 2014కు ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ల ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటర్లు, వేలాదిగా, లక్షలాదిగా మోటర్ల రిపేర్లు కనబడిందో.. ఇప్పుడు మల్లా అదే సీన్ పునరావృతం అయ్యింది. ఈ ప్రభుత్వం అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి.. టెంప్ట్ చేసి మంచిగున్నవాళ్ల నోట్లె మట్టిగొట్టింది. అన్నీ మోసాలే. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్లా సిగ్గులేకుండా ఇయ్యాల మరో నాలుగైదు హామీలు ఇచ్చారు. అవి ఎవరిని ఉద్ధరించడానికో అర్థం కాదు.
వెదిరె, గంగాధరల వంటిచోట్ల నా పర్యటన లేని గ్రామాల్లో కూడా రైతులు అడ్డం వచ్చి ఎండిపోయిన వరిని తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి మా ఊర్లో 600 ఎకరాలు పోయింది.. మా ఊర్లో 800 ఎకరాలు పోయింది అని చెప్తున్నరు. మీదికి పొలం పచ్చగ కనిపిస్తున్నది గానీ కింద పర్రెలు పెట్టింది అని పొలం లోపలి దాకా తీసుకపోయి చూపించినరు. ప్రతి దగ్గర ఇదే పరిస్థితి. కరీంనగర్, మెదక్, గోదావరి బేసిన్లో ఉన్న జిల్లాల్లో ఈ పరిస్థితి ఎందుకు రావాలి?. ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఈ కరువుకు కారణం ఎవరు? ఎవరి అసమర్థత.. ఎవరి తెలివి తక్కువతనం? కిరికిరి మాటలు, అడ్డగోలు మాటలు, తొండి మాటలతో ఇతరుల మీద ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ తప్పించుకోలేరు. రాళ్లవాన అని ప్రభుత్వం అంటున్నది. కానీ దానిద్వారా దెబ్బతిన్నది లక్షన్నర ఎకరాలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా 15-20 లక్షల ఎకరాల మధ్య పంటలు ఎండిపోయినయి. దీనికి రెండు విధాలుగా ప్రభుత్వమే కారణం. నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడాల్నో తెలవకపోవడం మొదటి కారణం. పాత బోర్లు ఉన్నయి కాబట్టి కరెంటుతోనన్న పారించి పంటలు దక్కించుకుందామంటే.. కరెంటు నాణ్యతగా రాక, మోటర్లు కాలిపోవడం రెండో కారణం. వెరసి ప్రభుత్వ వైలఫ్యం వల్లే పంటలు ఎండినయి. కొంతమంది అసమర్థులైన మంత్రులు వర్షపాతం తక్కువుంటే మా మీద బదనాం పెడుతున్నరని మాట్లాడుతున్నరు. అది శుద్ధ తప్పు. దాదాపు 20-25 జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా అధికంగా వర్షం కురిసింది. కేవలం ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
కాలం కాకపోతే రైతు ఇంత నష్టపోడు. దేవున్నో, ధర్మాన్నో తిట్టుకుంటడు. పంట వెయ్యడు. కానీ ఇక్కడ పంట వేసి, పెట్టుబడి పెట్టి, రోదిస్తున్నరు. రూ.25 వేలు పెట్టినమని కొందరు, రూ.22వేలు పెట్టినమని కొందరు.. ఇలా పెట్టిన పెట్టుబడి మొత్తం గంగపాలు అయ్యిందని మొత్తుకుంటున్నరు. వంద రోజుల్లో 200 పైచిలుకు రైతులు చనిపోయారని నేను మొన్న చెప్తే.. వివరాలు ఇవ్వండి 48 గంటల్లోగా పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మేం నాలుగు గంటలల్లోనే 209 మంది రైతుల జాబితాను ప్రభుత్వానికి, ప్రధాన కార్యదర్శికి పంపినం. దాని తర్వాత ఇంకో ఐదు, పది దుర్ఘటనలు జరిగినయి. అయినా ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. ప్రభుత్వ అసమర్థత వల్లే చనిపోయారు కాబట్టి తలా రూ.25 లక్షలు చొప్పున ఆ కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఆ కుటుంబాలను పరామర్శించాలి. లేకుంటే ఆ ఉసురు, పాపం తగులుతది. పంట కోసంవేసిన పెట్టుబడిపోయింది. వస్తదనుకున్న పంటపోయింది. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటామంటున్నారు. వద్దని నేను వాళ్లకు దండంపెట్టి చెప్తున్న.
పంటలు ఎండిన మాట వాస్తవం. నష్టం జరిగిన మాట వాస్తవం. రైతాంగం ఈ రోజు కన్నీరు మున్నీరవుతున్న విషయం వాస్తవం. 15- 16 లక్షల ఎకరాలంటే చిన్న విషయం కాదు. ఇది ప్రకృతి విపత్తు కంటే పెద్దది. ఈ సందర్భంగా రైతులను ప్రభుత్వం కాకపోతే ఎవరు ఆదుకోవాలే? ఎకరానికి రూ.25వేలు పరిహారం ఇవ్వాలి. తప్పించుకుంటామనుకుంటే ప్రజలు మీ వీపును విమానం మోత మోగిస్తరు. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు. మీ డ్రామాలు నడవవు.
సాగర్‌లో ఇప్పటికి డెడ్ స్టోరేజీ మీద 14 టీఎంసీల నీళ్లున్నయి. డెడ్‌స్టోరేజీ కింద 7 టీఎంసీలు, డెడ్‌స్టోరేజీ మీద 7 టీఎంసీల నీళ్లున్నయి. కేఆర్ఎంబీ వాడు మనకు బాస్లాంటోడా? వాడు కేవలం రెండు రాష్ర్టాల మధ్య సమన్వయకర్త. వానికి మనమీద పెత్తనమెట్లుంటది.? తమాషా ఏదంటే.. నేను సూర్యాపేట జిల్లాకు పోతే నీళ్లు వదిలినరు. నా బస్సు వాపస్రాంగనే నీళ్లు వాపస్ పోయినయని ఫోన్లు వచ్చాయి. ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి.. నేను చెప్తే నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు వదిలినరు. నేను కరీంనగర్ వస్తుంటే.. మొత్తం కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం పంపులు ఆన్‌చేసి వరదకాల్వల్లోకి నీళ్లు వదిలినరు. పైగా.. నీళ్లు వదలాలని కేసీఆర్ మాకు ముందే చెప్పాలె కదా అని సిగ్గులేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటడు. మరి ముఖ్యమంత్రివి నువ్వా.. నేనా? నీ ఇంజినీర్లు ఏం చేస్తున్నరు? ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నడు? డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, నువ్వేం చేస్తున్నవు? సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులను సమయానికి వాడుకోక, క్వాలిటీ కరెంట్ ఇవ్వక, సమయానికి రైతుబంధు ఇవ్వక, వెర్రి తిర్రి మాటలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు.
నేను నాలుగు నెలల వరకు నోరు తెరువలే. వాళ్లు ఎన్ని పిచ్చిపిచ్చి ఆరోపణలు చేసినా.. ఎన్ని పీఆర్ స్టంట్లు చేసినా.. వాళ్లకు తొత్తులుగా ఉన్న మీడియాలో అడ్డగోలు వార్తలు రాయించి ఏం చెప్పినా మేం మాట్లాడలే. కొత్త ప్రభుత్వం వచ్చింది.. టైమియ్యాలె అని నేను మాట్లాడలే. మంచిచెడ్డలు ప్రజలకు తెల్వాలని ఓపికపట్టినం. మేమేదో ఓర్వలేక అంటున్నమని అంటరని ఓపిక పట్టినం. ఇప్పుడు కేసీఆర్ ఎళ్లిండు.. ఇక ఆగడు. ఒక జిల్లా, రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతులకు కష్టమొస్తే అక్కడ గద్దలెక్క వాలుతా. మీ సంగతి తేలేదాకా వందకు వంద శాతం పోరాటం చేస్తం. ఈ పోరాటం ఒక రోజుతో, ఒక పూటతో అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారమయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం. వంద శాతం మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చినరు. కాబట్టి ఆ పాత్రకు మేము పూర్తి న్యాయం చేస్తం. మీ మెడలు వంచుతం, ప్రజలకు న్యాయం చేస్తం.
బీజేపీ.. ఒక పార్టీయేనా అసలు?. గతంలో వంద నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్లలో డిపాజిట్ పోయింది. ఇప్పుడు క్యాండేట్ కావలెను.. క్యాండేట్ కావలెను.. అనుకుంట మా నాయకులు, కార్యకర్తల చుట్టూ తిరుగుతున్నరు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.