KCR Pressmeet | ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని చెప్పారు. అవసరమైతే ఎక్కడికక్కడ గ్రామాల్లో మీ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తామని స్పష్టం చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నీళ్లందక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు.
ఒకప్పుడు పంటలు నష్టపోతే కేంద్రానికి నివేదిక పంపించాల్సి ఉండేది.. మూడు నెలల తర్వాత అధికారులు వచ్చి పరిశీలించి.. రిపోర్టు రాయాలి.. అయినా రైతులకు పరిహారం అందే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. అందుకే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని మార్చేశా అని తెలిపారు. భయంకరమైన రాళ్ల వాన పడి మహబూబాబాద్, ఖమ్మం, ఇలా చాలా జిల్లాల్లో పంట నష్టం జరిగితే స్వయంగా వెళ్లి పరిశీలించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడప్పుడే రైతులు బలపడుతున్నరు కాబట్టి వాళ్ల పరిస్థితి దిగజారవద్దని.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఎకరానికి 10వేలు నష్టపరిహారం ఇచ్చా అని తెలిపారు. నష్టపోయిన ఆ పొలంలోనే నిల్చుండి ప్రకటించడమే కాకుండా.. ఐదారు రోజుల్లోనే నష్టపరిహారం అందించానని అన్నారు. ఆనాడు దాదాపు 500 కోట్లను రైతులకు అందించామని చెప్పారు. అదే ఇవాళ రాళ్ల వాన పడితే అడిగే దిక్కులేదని మండిపడ్డారు. అకాల వర్షాలు పడి సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతే దాని గురించి మాట్లాడే దిక్కే లేదని అన్నారు. ఓ ఎమ్మెల్యే పోడు.. మంత్రి పోడు.. ముఖ్యమంత్రికి అయితే ఢిల్లీ యాత్రలతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఏదేమైనా సరే.. రణరంగమైనా సరే.. ఈ ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు.
2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాడు కూడా 470 కోట్ల బకాయిలు పెట్టిపోతే.. మేం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. అదే ఈనాడు తాము ఏ బకాయిలు పెట్టలేదని అన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పరిపాలనలో ఏనాడు ఇవ్వని 10వేలు నష్టపరిహారం అందిస్తే.. ఆనాడు దాన్ని ఎకసెకం చేసి మాట్లాడారని మండిపడ్డారు. 10 వేలు ఏమూల సరిపోద్ది.. 20 వేలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ నాయకులు అన్న మాటలను గుర్తు చేశారు. మరి ఇవాళ ఏడ పడుకున్నరు.. తలకాయ ఏడ పెట్టుకున్నారని నిలదీశారు. గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నరా? వీళ్లు రైతులు కాదా? ప్రజలు కాదా? వీళ్ల గురించి పట్టింపు లేదా? అని మండిపడ్డారు. ప్రజల తరఫున మాట్లాడేటోళ్లు లేరని అనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత బీఆర్ఎస్ పార్టీ ఉంది.. ఊరుకోదని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
పంటలను మీరే ఎండబెట్టిర్రు కాబట్టి.. మీ అసమర్థత వల్లే ఎండిపోయినయి కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని కేసీఆర్ తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఎన్యుమరేట్ చేయాలని సూచించారు. ఏ జిల్లాల్లో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైతు పంట ఎంత ఎండిపోయిందనే లెక్కలు తీయాలని అన్నారు. ధరలు అన్నీ పెరిగినయ్ కాబట్టి.. ఎకరాకు రూ.25వేలు నష్టపరిమారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని తెలిపారు. ఎక్కడికక్కడ మీ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తామని అన్నారు.. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు మాకు ఉంటది కాబట్టి.. ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతు మేమే అని తెలిపారు. ‘ మీరు ఒకర్నో.. ఇద్దర్నో కుక్కల్నో.. నక్కల్నో గుంజుకుని ఓహో అహా అని సంకలు గుద్దుకోవచ్చు. అది చిల్లర రాజకీయ స్టంట్. ప్రజల సమస్యల ముందు, ప్రజల బాధ ముందు.. ఎండిపోయిన పంటల ముందు చిల్లర రాజకీయాలు చేయడం కాదు ‘ అని అన్నారు. ఎండిన ప్రతి ఎకరాన్ని మీరు ఎన్యుమరేట్ చేయించాలని సూచించారు. బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయని.. కచ్చితంగా లెక్కలు తీస్తామ