హైదరాబాద్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు దారిపొడవునా జననీరాజనం పలికింది. రైతులు, మహిళలు, యువతీయువకులు, చిన్నారులు ఒక్కరేమిటీ బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు సబ్బండవర్గాల ప్రజలు కదలివచ్చారు. దూరం నుంచే పబ్బతి పడుతూ జేజేలు పలికింది.
కేసీఆర్ బస్సుయాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైంది. కేబీఆర్ పార్క్, పంజాగుట్ట, బేగంపేట, ఉప్పల్, వనస్థలిపురం, హయత్‌నగర్, చిట్యాల, నార్కెట్‌పల్లి మీదుగా మిర్యాలగూడకు కొనసాగింది. అక్కడి నుంచి తిప్పర్తికి, ఆపై సూర్యపేటకు చేరుకున్నారు. యాత్రలో దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. పూలు చల్లుతూ, హారతులు ఇస్తూ, డోలువాయిద్యాలతో, పటాకులు పేల్చుతూ ఘనస్వాగతం పలికారు. పట్టణంలో బిల్డింగులపైకి ఎక్కి దూరం నుంచే చూస్తూ జనం జేజేలు కొట్టారు. కేసీఆర్ అభివాదం చేస్తుంటే మురిసిపోయారు. కేసీఆర్ రాక తెలుసుకుని ఆయా రూట్లలోని సమీప గ్రామాల నుంచి ప్రజలు, కర్షకులు, మహిళలు భారీగా రోడ్లపైకి తరలివచ్చి జయజయధ్వానాలు పలికారు. దారివెంట ఆటోలు, బస్సుల్లోని ప్రజలు సైతం బస్సుయాత్రలో కేసీఆర్‌ను చూసేందుకు ఎగబడ్డారు. పంటక్షేత్రాల్లోని కర్షకులు, రోడ్డువెంట ఉన్న దుకాణాదారులు కేసీఆర్‌కు పబ్బతి పట్టారు. ఆడబిడ్డల సంబురానికి అంతులేకుండా పోయింది. కేసీఆర్ బస్సుయాత్ర రూట్లోని గ్రామాలు, పట్టణాల్లో ఉదయం నుంచే జనం రోడ్లపైనే గుంపులు గుంపులుగా చేరి చర్చించుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు, యువకులు ద్విచక్రవాహనాలపై బీఆర్ఎస్ జెండాలను పట్టుకుని బస్సుయాత్ర ముందుసాగడం విశేషం.
సూర్యపేటలో నిర్వహించిన కేసీఆర్ బస్సుయాత్రకు అనూహ్య స్పందన లభించింది. సూర్యపేట పట్టణం జనసంద్రమైంది. ఫ్లై ఓవర్ నుంచి సూర్యపేట పట్టణం వరకు ఎటు చూసినా జనమే. జమ్మగడ్డ జంక్షన్లో ఇసుకేస్తే రాలనంతగా పట్టణవాసులు తరలివచ్చారు. బహిరంగసభకు తలపించేలా దాదాపు 30-40వేల మందికిపైగా ప్రజలు తరలివచ్చారు. సూర్యపేట పట్టణమంతా గులాబీమయమైంది.
బస్సుయాత్ర నల్గొండ బైపాస్ రోడ్లో అన్నెపర్తి దాటిన తరువాత రోడ్డు పక్కనే ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. బస్సు దిగి కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో ముచ్చటించారు. ‘మీ పాలనే బాగుండె సార్. మార్పు అంటే నమ్మి మోసపోయినం’ అంటూ ఆవేదన వ్యక్తం చేయగా, రైతులకు ధైర్యం చెప్పారు. పోరాడి డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. తిప్పర్తి దాటిన అనంతరం రోడ్డు పక్కన ఉన్న విడిది హోటల్ వద్ద టీ తాగారు. స్థానిక నేతలతో మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో ఓ చిన్నారికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు.