బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వారితో తనకున్న ఉద్యమ, రాజకీయ అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
గ్రామస్థాయి నుంచి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన శ్రీహరి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు పార్టీ తరఫున నిబద్ధతతో సేవ చేశారని కేసీఆర్ అన్నారు. వారి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన కర్ర శ్రీహరి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.