జయశంకర్ భూపాలపల్లి, మే 5 (నమస్తేతెలంగాణ)/మహదేవపూర్ : ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తే.. పాలన చేతకాని దద్దమ్మలు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. వాస్తవాలు’పై చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమానికి సిరికొండతోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సాగునీటి రం గ నిపుణులు వీరమల్ల ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో మళ్లీ సమైక్య పాలన గుర్తుకు వస్తున్నదని అన్నారు.
చంద్రబాబుకు రేవంత్ ఏజెంట్ అనే విషయం ప్రజలందరికీ తెలుసని.. చంద్రబాబు, రేవంత్ సమష్టి ప్రయోజనం ఆంధ్రా అభివృద్ధి కోసమేనని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పిల్లర్లను కాంగ్రెస్ సర్కార్ రిపేరు చేయలేని దుస్థితిలో ఉన్నదని విమర్శించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ద్వారా రైతులకు నీళ్లు అందించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయకుండా కేసీఆర్ మార్క్‌ను చెరిపేయాలనే ఏకైక లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే మళ్లీ జల సాధన ఉద్యమం ప్రారంభం కాక తప్పదని హెచ్చరించారు. ఊరూరా కాంగ్రెస్ కుట్రలపై చర్చ జరగాలని, ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్లు శ్రీహర్షిణి, వసంత పాల్గొన్నారు.
మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ కుంగుబాటుపై అనుమానాలున్నాయని సాగునీటి రంగ నిపుణులు వీ ప్రకాశ్ అన్నారు. మేడిగడ్డలోని 20వ పిల్లర్ చిన్నగా కుంగిందని, దీంతో పెద్ద శబ్దం వచ్చిందనే విషయం కాంగ్రెస్ నాయకులకు ముందే ఎలా తెలిసిందని, ఎన్నికలకు ముందే పిల్లర్ ఎందుకు కుంగిందని ప్రశ్నించారు. బరాజ్‌లో వచ్చిన భారీ శబ్దంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఏమైందని, విచారణ ఎంతవరకు వచ్చిందని, ఇదంతా కుట్రలో భాగమనే విషయం అవగతమవుతున్నదని అన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు బాగానే ఉన్నాయని, ఎన్డీఎస్ఏ సైతం ఈ రెండు బరాజ్‌లు రిపేరు చేయాలని సూచించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం మూడు బరాజ్‌లు కూలిపోయాయని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బరాజ్ కుంగినప్పటికీ రిపేరు చేసే అవకాశం ఉన్నా రేవంత్ ప్రభుత్వం కావాలనే పక్కన పెట్టిందని విమర్శించారు. రూ.200 కోట్లతో తామే మరమ్మత్తు చేస్తామని ఎల్అండ్టీ సంస్థ ముందుకొచ్చినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.
మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగితే అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను ఎందుకు పక్కన పెట్టారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. అన్నారం బరాజ్‌లో చిన్నచిన్న సీపేజ్‌లు వచ్చాయని, వాటికి ఏనాడో మరమ్మతులు చేశారని, సుందిళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, ఎన్డీఎస్ఏ సైతం ఈ రెండు బరాజ్‌లకు క్లియరెన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా వాటిని ఎందుకు పక్కన పెట్టారో ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.