హైదరాబాద్, జూలై 6 (నమస్తేతెలంగాణ): గోదావరి నీటిని వదిలి గురువు చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి మేలు చేస్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ధర్మేందర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల్లో నీళ్లు నిల్వ ఉంచితే ముప్పు తప్పదంటూ, భద్రాచలం మునిగిపోతదంటూ మంత్రి ఉత్తమ్ సొల్లు పురాణం బంద్ పెట్టాలని మండిపడ్డారు. సూపర్ ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బరాజ్‌లకు ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందని తెలిపారు. అవసరమైతే పార్టీని రద్దు చేసుకుంటామని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటామని, ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్ ద్వారా అండర్‌టేకింగ్ ఇప్పిస్తామని ప్రకటించారు.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరిట దుష్ప్రచారం చేస్తూ కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. సుందిళ్ల, అన్నారం బరాజ్‌లో నీరు నింపితే ప్రమాదం జరుగుతుందని ఎన్డీఎస్ఏ ఎక్కడా నివేదించలేదని స్పష్టంచేశారు. 2022లో 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొని నిలబడ్డాయని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ మంత్రులు తప్పుడు మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతల బూటకపు ప్రచారాన్ని మొన్న కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం బట్టబయలు చేసిందని చెప్పారు. ప్రస్తుతం ప్రాణహిత వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నదని, కన్నెపల్లి మోటర్లు ఆన్‌చేస్తే 150 టీఎంసీల నీరు నిల్వ చేసుకొనే అవకాశమున్నదని పేర్కొన్నారు.
పది పైసల అవినీతి నిరూపించలె..
కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న ప్రభుత్వం రెండున్నరేండ్లలో పది పైసల అక్రమాలను నిరూపించలేకపోయిందని దెప్పిపొడిచారు. కరువును ఎదుర్కొనేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్‌పై కక్ష సాధిస్తూ బృహత్తర ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మేమేం సీఎం రేవంత్ కుర్చీ అడుగడంలేదు.. నీటిపారుదల శాఖను అడుగుతలేం.. కేవలం కొద్దిమంది అధికారులను మాకు వారంపాటు ఇస్తే మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్, గంధమల్ల, మోతె మండలంలోని చివరిగ్రామం, రావి చెరువు, ఎస్సారెస్పీ దాకా నీటిని తరలించి చూపుతామని పేర్కొన్నారు. కన్నెపల్లి మోటర్లను ఆన్ చేయాలనే సోయి ఉత్తమ్‌కు లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులతో ఎన్డీఎస్ఏకు సంబ ంధం లేదని పేర్కొన్నారు. అదే ఉంటే ఎస్ఎల్బీసీ ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాల్సి వచ్చేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
భద్రాచలం కొట్టుకుపోతుందా?: వినోద్
‘కన్నెపల్లి పంపులు ఆన్‌చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని, అన్నారం, సుందిళ్లకు ముప్పు తప్పదనే ఉత్తమ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ ఎంపీ వినోద్ మండిపడ్డారు. ఇసుకతవ్వకాల కోసమే మేడిగడ్డను మరమ్మతు చేయడం లేదని విమర్శించారు.
కాళేశ్వరంపై ఉత్తమ్‌కు అవగాహనలేదు: గంగుల
మంత్రి ఉత్తమ్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లపై అవగాహన లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నింపవద్దని ఎన్డీఎస్ఏ ఏనాడూ చెప్పలేదని స్పష్టంచేశారు. మేడిగడ్డతో సంబంధంలేకుండానే కన్నెపల్లి ద్వారా కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లికి తరలించవచ్చని తెలిపారు. వెంటనే నీరందించకుంటే చలో కన్నెపల్లి, ఎల్లంపల్లికి పిలుపునిస్తామని హెచ్చరించారు.