మద్దూరు/కోస్గి, జనవరి 19 : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్స్‌లో, అలాగే కోస్గిలోనూ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పుర పోరులో గులాబీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ హామీలను మరిచిందంటూ బాకీ కార్డులను ప్రదర్శించారు. మద్దూరులో బ్రహ్మాండంగా హైస్కూల్, 30 పడకల దవాఖాన నిర్మించి పరికరాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ పరికరాలను నారాయణపేటకు తీసుకెళ్లారని ఆరోపించారు. మద్దూరులో బీఆర్ఎస్ హయాంలో రోడ్లు వెడల్పు చేస్తే.. పెండింగ్ పనులు రెండేండ్లుగా పూర్తి చేయడంలో సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో కోస్గి, కొడంగల్‌ను మున్సిపాలిటీగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధే ప్రస్తుతం కనిపిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కాగా కోస్గి పట్టణంలో వెంకట్ నర్సింహులు ఆధ్వర్యంలో వివిధ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్లో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.