బెజ్జంకి, డిసెంబర్ 14 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. జుట్టు(కవ్వంపల్లి) అశ్విని 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నివాసముంటున్న గుండారం గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన తాళ్లపల్లి భీమయ్య, కాంగ్రెస్ అభ్యర్థి ఎలుకంటి శ్రీనివాస్‌రెడ్డిపై 87 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు విడతల్లో బీఆర్ఎస్ 50 శాతం స్థానాలకు పైగా గెలుపొందింది. ఈ ఫలితాలతో అధికార పార్టీ డీలా పడిపోయింది. రెండో విడతలో తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని 88 గ్రామాల్లో ఎన్నికలు జరుగగా, బీఆర్ఎస్ 38 స్థానాలు దక్కించుకున్నది.
కాంగ్రెస్ 36, బీజేపీ 6 స్థానాలకు పరిమితమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో సత్తాచాటారు. 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఈ జిల్లాకు రానున్నారు. తొలి, మలి విడతల్లో గెలిచిన సర్పంచులను ఘనంగా సన్మానించనుండగా, పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగ య్య, చక్రపాణి ఏర్పాట్లు చేస్తున్నారు.