సంగారెడ్డి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయలు చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆ పార్టీ మోసాలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పటం ఖాయమని వ్యాఖ్యానించారు. ‘ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసింది నీ తిట్ల కోసమా? కేసీఆర్‌ను తిట్టడం, లీకులు ఇచ్చి పేపర్లలో వార్తలు రాయించటం, ఫేక్ వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు చేయటంతోనే కాలం వెల్లదీస్తున్నవ్. తెలంగాణ తెచ్చి పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌పై మాట్లాడే భాష ఇదేనా?’ అని సీఎం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేశ్గడ్డలోని గణపతి ఆలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోసం ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ.. రైతులకు రూ.500 బోనస్ చెల్లించాలని కోరితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలుతావా? అని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి కంటే తాము ఎక్కువే తిట్టగలమని, సంస్కారం ఉంది కాబట్టి తిట్టడం లేదని అన్నారు. తిట్లు తిట్టడం కాదు, మంచి పనితనంతో ప్రజల మెప్పు పొందాలని సీఎంకు హితవు పలికారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వాటిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అడ్డా
మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 2004 నుంచి బీఆర్ఎస్ వరుసగా మెదక్ పార్లమెంట్లో విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్నదని వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పరిస్థితి పాలపొంగులా తయారైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 120 రోజులైనా హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, రైతుభరోసా, కౌలురైతులకు ఆర్థిక సహాయం తదితర హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు.
ప్రజలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నత విద్యావంతుడు అని, కలెక్టర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 ఏండ్లు పనిచేసి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గుణగణాలు ప్రజలందరికీ తెలుసు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలవని బీజేపీ ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు?’ అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీవైస్‌చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు సపాన్‌దేవ్, శంకర్‌యాదవ్, గడీల శ్రీకాంత్‌గౌడ్, వేణుగోపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు కొలను రాజాబాల్రెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, లలితాసోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.