రవీంద్రభారతి (హైదరాబాద్) : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ (Mala JAC) వెల్లడించింది . ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ (BRS) అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితామహుడు , భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడం, కొత్తగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. దళితుల సంక్షేమానికి దళిత బంధు(Dalit Bandu) ద్వారా ఉపాధి కోసం రూ. 10 లక్షలు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల (Students) చదువుల కోసం గురుకుల పాఠశాలను స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాడని పేర్కొన్నారు.
విదేశీ విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.20 లక్షలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ (CM KCR) దేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు బీఆర్ఎస్కు మద్దతు తెలియజేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో ఉన్న మాలలు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కో కన్వీనర్ నల్లాల కనకరాజు, వర్కింగ్ చైర్మన్ తాళ్లపల్లి రవి, చీఫ్ అడ్వజర్ రాహుల అంజయ్య, చీఫ్ కోఆర్టినేటర్ డాక్టర్ యం. భాస్కర్, వైస్ చైర్మన్ టి.అనిల్, యం.బే వినోద్‌కుమార్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.