నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 19: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇంటి పండుగలా కుటుంబసమేతంగా హాజరవుతున్నారు. కార్యకర్తల కష్టసుఖాలు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అడిగి తెలుసుకుంటున్నారు. కార్యకర్తలకు కొసరికొసరి భోజనాలు వడ్డిస్తున్నారు. బుధవారం మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.
కేసీఆర్‌కు అండగా నిలవాలి: ఎర్రబెల్లి
ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచామడూరు, వెలికట్ట పరిధిలోని వివిధ పంచాయతీలను కలిపి తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. మంత్రి ఎర్రబెల్లి, ఆయన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్పర్సన్ ఉష.. పార్టీ నేతలు, కార్యకర్తలకు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పొంగులేటివి డబ్బు రాజకీయాలు: పల్లా
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వార్థపూరిత వ్యక్తి అని, డబ్బు ఉన్నదన్న అహంతో డబ్బు రాజకీయాలు చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్న పొంగులేటి, అసెంబ్లీ వద్ద గేట్ కీపర్‌గా ఏమైనా పనిచేస్తున్నారా.. అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మ ధు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచం ద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ కమల్‌రాజు, డీసీఎంఎస్ చైర్మన్ రా యల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే మా బలం.. బలగం: వినోద్
తెలంగాణ పథకాలకు కేంద్రమే అవార్డులు అందిస్తుంటే బీజేపీ నేతలు కండ్లుండీ చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలే మాలం, పార్టీకి బలగమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.