హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడం, పంట పెట్టుబడిగా ఎకరానికి ఏటా రూ.10 వేలు ఇవ్వడం, ఉచిత విద్యుత్తు, సాగునీటి సౌకర్యం, గ్రామాల్లోనే పంట కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాల నేపథ్యంలో బీఆర్ఎస్ని భారత రైతు సమితిగా కేటీఆర్ అభివర్ణించారు.
శుక్రవారం ట్విట్టర్లో ఆయన ఇలా స్పందించారు. ఒక్క తెలంగాణలోనే మన అన్నదాతకు పెట్టుబడి కోసం రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు, ‘ఒక్క కేసీఆర్ సారు ఉంటే చాలు.. మాకు అదే పదివేలు.. వేరేటోళ్లొస్తే తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి’ ఇదీ రైతుల మనోగతమని ట్వీట్ చేశారు.