Vemula Prashanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హ్యామ్ ప్రోగ్రాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శనివారం ఎ మ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు కిశోర్‌గౌడ్, శ్రీధర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం స్కామ్‌లకు నిలయంగా మారిందని మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల కుం భకోణంలో కాంగ్రెస్ బడా నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తంచేశారు. హ్యామ్ మాడల్ ద్వారా రోడ్లకు మహర్దశ పట్టబోతున్నదని డిప్యూటీ సీఎం, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
రూ. 27వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1లో రూ. 17 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని, ఇందులో రూ.8 వేల కోట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అంచనాలను పెంచి ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రణాళికలు రచించారని నిప్పులు చెరిగారు. హ్యామ్ ద్వారా 5,566 కి.మీ మేర రూ. 10, 547 కోట్లతో రోడ్లు నిర్మించేందుకు నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఆర్అండ్బీ ద్వారా 22న ఒక జీవో ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో 7449 కి.మీ రోడ్ల నిర్మాణానికి రూ. 6294 కోట్లతో ఈనెల 16న టెండర్లు పిలిచారు. మళ్లీ ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు కలిపి రూ.17వేల కోట్లకు టెండర్లు ఆహ్వానించారు.
మళ్లీ ఈ నెల 18న జీవో ఆర్టీ నంబర్ 477 ఆర్అండ్బీ శాఖ సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ) కింద రాష్ట్రంలో రోడ్లు మంజూరు చేస్తూ ఇంకో జీవో వచ్చింది.. దీని ప్రకారం 31 పనులు సింగిల్ లేన్ నుంచి డ బుల్లేన్గా మార్చేందుకు 409 కి.మీకు రూ. 721 కోట్లు ఖర్చవుతాయని పరిపాలన అనుమతులు ఇచ్చారు.. అంటే సింగిల్ లేన్ నుంచి డబుల్‌లేన్‌గా మార్చేందుకు కి.మీకు 1.75 కోట్లు ఖర్చవుతున్నాయి. కానీ ఈనెల 16న ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో హ్యామ్ విధానం లో 866 కి.మీ సింగిల్ లేన్ నుంచి డబుల్‌లేన్‌గా మార్చేందుకు రూ.2,377 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. అంటే కి.మీకు రూ. 2.75 కోట్లు (ట్యాక్స్ లేకుండా) ఖర్చవుతుందని చెప్పారు.’ అని వివరించారు.
సీఆర్ఐఎఫ్లో సింగిల్‌లేన్ నుంచి డబుల్‌లేన్‌గా మా ర్చేందుకు కి.మీ రూ.1.75 కోట్లు (విత్ ట్యాక్స్) ఖర్చయితే, హ్యామ్‌లో రూ. 3.30 కోట్లు(విత్ ట్యాక్స్) ఖర్చవుతున్నదని పేర్కొన్నారు. ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఖజానాలో నిధుల్లేవని చెబుతు న్న ప్రభుత్వం, హ్యామ్ పేరిట బడా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోచిపెట్టేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. వెయ్యి రోడ్లను విడివిడిగా కాకుండా పెద్ద ప్యాకేజీల రూపంలో టెండర్లు పిలువడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో ప్రభుత్వ పెద్దలే ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
హ్యామ్ మాడల్‌లో వేసిన రోడ్ల గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం ఏటా 4% చొప్పున 15 ఏండ్లు సిద్ధపడటం ఎందుకని ప్రశ్నించా రు. అంటే ఒక కి.మీకు 15 ఏండ్లకు రూ. 2 కోట్ల చొప్పున ఖర్చవుతుందని తెలిపారు. అలాగే ఐదేళ్లకు ఓసారి 8 %, 12 ఏండ్లకు మళ్లీ 8%..కాంట్రాక్టర్లకు మెయింటనెన్స్ కింద ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ఆక్షేపణీయమని స్పష్టంచేశారు. హ్యామ్ విధానంలో ఒక కి.మీకు రూ. 6 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. హ్యామ్‌లో 40% ప్రభు త్వ ం, 60% కాంట్రాక్టర్ భరించాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ తీసుకున్న లోన్లకు ప్రభు త్వం ఏటా 12% చొప్పున వడ్టీ చెల్లించడం దారుణమని దుయ్యబట్టారు. కాంట్రాక్టుర్లు రూపాయికూడా ఖర్చు పెట్టాల్సిన అవసరంలేదని తెలిపారు. కాంట్రాక్టర్లకు చెల్లించే 40% నిధులతోనే నిర్మాణాన్ని పూర్తిచేయవచ్చని చెప్పారు. కానీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచిందని ఆరోపించారు.
హ్యామ్ ముసుగులో ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీని అడ్డుకోవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు లూటీని అడ్డుకోవాల్సిన బాధ్యత వారిపై లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా స్పందించి హ్యామ్ మాడల్‌లో చేపట్టే రోడ్ల నిర్మాణంపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థల తలుపుతట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ దోపిడీ పర్వంలో వారు కూడా భాగస్వాములైనట్టు భావించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.