Palamuru | కేంద్రంలోని మోదీ సర్కార్.. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నాయి. ఏపీ ఒప్పుకొంటే తప్ప పాలమూరు ప్రాజెక్టు ముందుకు సాగదంటూ తెలంగాణ ప్రజానీకాన్ని భ్రమపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఆ ముసు గులో బనకచర్లకు మార్గం సుగమం చేసుకొనే వ్యూహం పన్నుతూ, పాలమూరు నీటి హక్కులపై పెను కుట్రలు చేస్తున్నాయి. ఆ ప్రణాళికలో భాగంగా ప్రజలను ఏమార్చేందుకు అనుకూల మీడియా ద్వారా కథనాలను వండివార్చుతున్నాయి. ఇప్పటివరకు ట్రిబ్యునల్‌ను పక్కకు నెట్టి, అనుమతులిస్తామని చర్చలు పెట్టిన కేంద్రమే.. ఇప్పుడు అదే ట్రిబ్యునల్‌ను సాకుగా చూపడం, పాలమూరుకు అనుమతులను నిరాకరించడం గమనార్హం.
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆశలు అడుగంటిపోతున్నాయంటూ ఓ ప్రధాన పత్రిక తెగ బాధపడిపోతూ ఓ కథనం ప్రచురించింది. ట్రిబ్యునల్‌ను, ఏపీతో ఒప్పందం సాకుగా చూపుతూ డీపీఆర్ పరిశీలనకూ కేంద్రం మరోసారి విముఖత చూపిందనేది సారాంశం. ట్రిబ్యునల్ అంశంపై 12 ఏండ్లుగా వాదనలు సాగుతున్నాయి. వాటిని పక్కకు నెట్టి, కొత్తగా జలసమస్యల పరిష్కారానికి కమిటీ వేసి, మధ్యవర్తిగా ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నది కేంద్రమే.
ఇప్పుడు మరోసారి ట్రిబ్యునల్‌ను, ఒప్పందాలను తెరపైకి తేవడం అనుమానాలకు తావిస్తున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై అక్కసు వెళ్లగక్కే ఆ పత్రికే ఇప్పుడు ఆశలు అడుగంటిపోతున్నాయని కథనం వండివార్చడం చర్చనీయాంశమైంది. ఇదంతా బాబు, రేవంత్ అండ్‌కో ప్లాన్ ప్రకారమే జరుగుతున్నదని తెలుస్తున్నది. ఒప్పందం తప్పదని ప్రచారంచేసి, ఆ ముసుగులో బనకచర్లకు మార్గం సుగమం చేసుకొనేందుకేనని స్పష్టమవుతున్నది.
కేసీఆర్ ప్రభుత్వం పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను, రాష్ట్రం మైనర్ ఇరిగేషన్ కింద వినియోగించుకోలేకపోతున్న 45 టీఎంసీలను మొత్తంగా 90 టీఎంసీల నికర జలాలను పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించింది. కేంద్ర అనుమతుల కోసం 2022లో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను నివేదించింది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం-1956 సెక్షన్ 3 ప్రకారం విచారణ కొనసాగిస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు 2023లో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణాజలాల్లో ట్రిబ్యునల్-1, 2 కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలు మొత్తం 1,050 టీఎంసీలను తెలంగాణ, ఏపీలకు పునఃపంపిణీ చేయాలని నిర్దేశించింది. 2024లో కేంద్రం పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపింది. డైవర్షన్ జలాల అంశంపై న్యాయవివాదంలో ఉన్నందున డీపీఆర్‌ను పరిశీలించలేమని తేల్చిచెప్పడంతో పెండింగ్‌లో ఉన్నది.
గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను మళ్లించుకొనేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు తెరపైకి తేవడం, మోదీ, రేవంత్ సర్కార్ సై అంటూ ముందుకు సాగిన విషయం తెలిసిందే. జలవివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చర్చలను నెరిపింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏపీ ఒప్పుకోవాలని, తద్వారా బనకచర్లకు-తెలంగాణను ఒప్పిస్తామని ప్రతిపాదనలను ముందు పెట్టింది. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా బనకచర్లను చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. కేంద్రాన్ని ముందుపెట్టి తెరవెనుక బాబు చేసిన ప్రతిపాదనలకు రేవంత్ సర్కార్ సైతం వత్తాసు పలుకుతున్నది. త్వరలోనే పాలమూరుకు శుభవార్త అందిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ప్రకటించారు.
తాజాగా ట్రిబ్యునల్‌ను సాకుగా చూపుతూ, డీపీఆర్ పరిశీలనకు కేంద్రం విముఖత చూపుతున్నదని ప్రచారం మొదలైంది. సూటిగా చెప్పాలంటే తెలంగాణను ఒప్పందం చేసుకోవాలని, అప్పుడే పాలమూరు ముందుకు సాగుతుందని కేంద్రం బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నట్టు తెలుస్తున్నది. ఇంతకాలం అనుమతులిస్తామని చర్చలు జరిపిన కేంద్రమే.. ఇప్పుడు ట్రిబ్యునల్‌ను సాకు చూపడమేందనే ప్రశ్న తలెత్తుతున్నది. ఏపీ సీఎంగా బాబు రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, కేంద్రం దన్నుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాసేందుకు కుట్రలను పన్నుతూనే ఉన్నది. అందుకు రేవంత్ సర్కార్ ఇతోదికంగా సహకరిస్తూ గురుభక్తి చాటుకుంటున్నారు.
పాలమూరుకు ఎన్వోసీ ఎరవేసి ఆ ముసుగులో గోదావరి జలాలను తన్నుకుపోయి, కృష్ణా జలాల్లోనూ గండికొట్టే కుట్రలకు తెరతీశారు. ఆ కూటమి త్రయం ఎత్తులను రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు, నీటిరంగ నిపుణులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ వస్తున్నారు. కుట్రలను తెలంగాణ ప్రజల ముందు పెడుతూ వస్తున్నారు. వాస్తవంగా ట్రిబ్యునల్-1 అవార్డు ప్రకారం.. పోలవరం డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు తెలంగాణకే దక్కే అవకాశమున్నది. న్యాయమైన నీటి హక్కు అంటే కృష్ణా జలాల్లో 75శాతం వాటా కోసం ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటే ఆ వాటాకు, వాదనలకు గండిపడే ప్రమాదమున్నది.
అదీగాక గోదావరిలో 968 టీఎంసీల వాటాలోనూ కోతపడనున్నది. బనకచర్ల ద్వారా మళ్లించే జలాల్లోనూ తెలంగాణకు వాటా రావాల్సి ఉన్నది. ఆయా అంశాలపై హామీ లేకుండా రేవంత్‌రెడ్డి కుట్రపూరిత ఒప్పందాలకు సిద్ధం కావడాన్ని బీఆర్ఎస్ ఎండగట్టడంతో బనకచర్లపై తుదిదశలో రేవంత్ సర్కార్ వెనుకడుగు వేసింది. ఒప్పందాలకు అంగీకరిస్తే తెలంగాణలో చారిత్రక ద్రోహిగా మిగిలిపోతామనే భయంతోపాటు, సీనియర్ కాంగ్రెస్ నేతల హెచ్చరికలతో రేవంత్‌రెడ్డి సైతం మీమాంసలో పడిపోయారు. ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఏపీకి సైతం తెగేసి చెప్పినట్టు అధికారవర్గాల్లోనూ చర్చ కొనసాగింది. ఈ అంశంపై ఏడు నెలలుగా ఇరు రాష్ర్టాలతోపాటు కేంద్రం సైతం గప్‌చుప్‌గా ఉండిపోయాయి. మళ్లీ ఉన్నపళంగా ఒప్పందం చేసుకోవడమే పాలమూరుకు శరణ్యమనే రీతిలో ఇప్పుడు బ్లాక్‌మెయిలింగ్ ప్రచారానికి తెరతీశాయని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఆ దిశగా ప్రచారం చేసి, ఎన్వోసీ సాధన పేరిట గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఏపీ బనకచర్ల ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకేనని అర్థమవుతున్నది.