హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ రహస్య స్నేహంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు వందశాతం నిజమని తేలాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీ బట్టబయలు చేశారట! ఈ అక్రమ బంధంపై ఆగ్రహం వ్యక్తం చేశారట! కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర నేతల మెతకవైఖరిని నిలదీశారట! గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిఫిన్ పెట్టి మరీ క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడంలో ఎందుకు విఫలమవుతున్నారని మోదీ నిలదీసినట్టు తెలిసింది. బీజేపీకి ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పట్ల ఎందుకు మెతకవైఖరి అవలంబిస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ఆరు గ్యారెంటీలు సహా ఇతర హామీలు అమలు చేయకపోవడాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని, ప్రజల్లో ఎందుకు ఎండగట్టడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. హైడ్రా, హెచ్‌సీయూ భూముల వ్యవహారం, హిల్ట్ పాలసీ, ప్రభుత్వ కీలక నేతల బంధువుల అవినీతిపై ఎందుకు నోరు విప్పడంలేదని అడిగినట్టు తెలిసింది. ప్రజాపోరాటాలు ఎందుకు చేయడంలేదని, ఓ ప్రతిపక్ష పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? అని మండిపడ్డట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మందలించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యనేతలతో బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మిలాఖత్‌పై స్వయంగా ప్రధాని మోదీ కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ముఖ్యులతో ఎందుకు అంటకాగుతున్నారంటూ బీజేపీ నేతలను తలంటినట్లు తెలిసింది. కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘మాకు ఏమీ తెలియదనుకోవద్దు.. ఎవరెవరు ఎవర్ని కలుస్తున్నారో, ఎవరితో మిలాఖత్ అవుతున్నారో అన్ని వివరాలతో నివేదికలున్నాయి’ అని హెచ్చరించినట్లుగా తెలిసింది. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.
జాతీయ పరిణామాలపై ఎంపీలు యాక్టివ్‌గా ఉండాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని సూచించినట్టు తెలిసింది. ఇతర రాష్ర్టాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచించినట్టు సమాచారం. ఎంపీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంపైనా మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అదే సమయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని చూసి నేర్చుకోవాలని రాష్ట్ర ఎంపీలకు ప్రధాని సూచించినట్టు సమాచారం. ఒవైసీ సోషల్ మీడియా కంటే తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా వెనుకబడి ఉన్నదని ఆధారాలు చూపి ఎంపీలపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కేంద్రంలో ఉప్పునిప్పులా ఉండే కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో మాత్రం సఖ్యతగా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ మొదటి నుంచీ చెప్తూ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు బీజేపీ ముఖ్యులు రక్షణగా నిలుస్తున్నారని, వారిపై ఈగ వాలకుండా కాపాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్‌రావు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అనేక విషయాల్లో కాంగ్రెస్‌ను కాపాడేందుకు బీజేపీలోని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆధారాలు కూడా చూపించారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నారని, దొంగచాటుగా కలుస్తున్నారని గతంలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం మీడియా ముఖంగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు మోదీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో బీఆర్ఎస్ ఆరోపణలు నిజమేనని స్పష్టమైంది.
ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలను కలవడానికి ముందే రాష్ర్టానికి చెందిన నలుగురు ఎంపీలను సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ క్యాంటిన్లో ప్రత్యేకంగా కలిసినట్టు తెలిసింది. వీరితో సుమారు 20 నిమిషాలు రాష్ట్ర రాజకీయాలు, బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా ఆరా తీసినట్టు సమాచారం. ఈ భేటీ సందర్భంగా బయటివారిని లోనికి అనుమతించలేదని తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డితో నలుగురు బీజేపీ ఎంపీలు భేటీ అయిన విషయం ప్రధాని దృష్టికి కూడా వెళ్లినట్టు సమాచారం. ఎంపీలతో భేటీ సందర్భంగా మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘ప్రతిపక్ష సీఎంను ఫార్మాలిటీగా కలవాలి కానీ, ఇలా గంటల పాటు కూర్చొని చర్చలు జరపడం ఏంటీ? ఈ భేటీ ద్వారా బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.