BRS | హైదరాబాద్, అక్టోబర్ 20 (హైదరాబాద్): రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయా? పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ప్రజాభిప్రాయం మారుతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని తేలింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఈ విషయమే వెల్లడైనట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎడాది పాలనపై రెఫరెండంగా జనంలోకి వెళ్తే ప్రజల నుంచి వచ్చే స్పందన, రాజకీయగా తమకు ప్రస్తుతం ఉన్న పట్టుపైన సర్వే నివేదికలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందాన్ని, ఇంటలిజెన్స్ వర్గాలను ఆదేశించినట్టు తెలిసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఒకటి రెండ్రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలందరిలో ఇప్పుడు దడ మొదలైంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితేమిటన్న చర్చ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో జరుగుతున్నది. దీనికి తోడు రైతు రుణమాఫీ, మూసీ పునజ్జీవం మీద ప్రతిపక్షాలు రాద్ధాం తం చేస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో సత్తా చూపితే ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయించవచ్చనే ఆలోచన చేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫాం మీద గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రహస్యంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసే కార్యక్రమాన్ని రేవంత్‌రెడ్డి సర్కా రు చేపట్టినట్టు తెలిసింది.
ఈ సర్వేలో విస్తుపోయే ఫలితాలు వచ్చినట్టు ప్రభుతంలో కీలకంగా ఉన్నవారే చెప్తున్నారు. గ్రాఫ్ పడిపోతున్నదని, కేవలం పదినెలల పాలనలో ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవడం గతంలో చూడలేదని, తాము చేయించిన సర్వేలో ఇదే తేలిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఊహించని విధంగా వస్తాయని, కేసీఆరే అత్యంత బలవంతుడని తేలిపోతుందని చెప్తున్నారు. అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని చెప్తున్నారు. ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు కాకున్నా, అమలు చేస్తున్న హామీలతో ప్రజల్లో సానుకూలత ఉన్నదని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితం అనుకూలంగా ఉంటుందా? ప్రతికూలంగా మారుతుందో తేల్చి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తను ఆదేశించినట్టు తెలిసింది.
రహస్యంగా అభిప్రాయ సేకరణ
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు గద్వాల, భద్రాచలం, స్టేషన్‌ఘన్‌పూర్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ల, పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రహస్యంగా తిరిగి ప్రజాభిప్రాయాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళల నుంచి వివరాలను సేకరించినట్టు తెలిసిం ది.గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. మెట్రో పాలిటన్ నగరంలోని నియోజకవర్గాల్లో హైడ్రా, ఎఫ్టీఎల్ కూల్చి వేతల మీద ప్రజలు అత్యంత ఆగ్రహంతో ఉన్నారని సర్వే తేల్చినట్టు తెలిసింది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిన బాధితులు ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వెళ్లడమే దీనికి అతిపెద్ద నిదర్శనమని చెప్తున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ భవన్‌కు తండోపతండాలుగా ప్రజలు వస్తుండడాన్ని సర్వే బృందాలు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన అత్యం త సమర్థంగా పని చేస్తున్నదని, తెలంగాణ భవన్‌కు హైడ్రా, మూసీ బాధితులు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, గ్రూప్-1 అభ్యర్థులు క్యూ కడుతున్నట్టు నివేదించారు. నిజానికి వీళ్లంతా సీఎం క్యాంపు కార్యాలయానికి, సచివాలయానికి సీఎంను కలవటానికి వెళ్లాలి కానీ, తెలంగాణ భవన్‌కు వెళ్లి కేసీఆర్ కోసం ఆరా తీస్తున్నారు. ఆయనను ఆరాధిస్తున్నారని సర్వే సంస్థలు నివేదించినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో ‘కేసీఆర్ మళ్లీ రావాలి’ అన్న వాదన పెరిగిందని, పదినెలల పాలనలో రేవంత్‌రెడ్డి సాధించింది శూన్యమని చెప్పినట్టు తెల్సింది. పార్లమెంటు ఎన్నికల వరకు అటు జాతీయ పార్టీగా బీజేపీని, కాంగ్రెస్‌ను చూసిన ప్రజలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి పెదవి విరుస్తున్నట్టు తేలింది. తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ బలంగా ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తరువాత కేసీఆర్ అత్యంత బలంగా మారారని, ఒక రకంగా రేవంత్‌రెడ్డికి రెడ్ అలెర్ట్ సంకేతాలే అందుతున్నాయని సర్వే ఫలితాలు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించారని సర్వేలో తేలినట్టు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభావం
రేవంత్‌రెడ్డి సర్కారుపై విపరీతమైన నెగిటివిటీ పెరిగిందని సర్వే సంస్థలు తేల్చిచెప్పినట్టు సమాచారం. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చేవని కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని రేవంత్‌రెడ్డి కోసం పనిచేసే ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇదే విషయాన్ని ఆయనకు కూడా నివేదించినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ, పింఛన్ల రూపంలో ఇచ్చే మొత్తాలను పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం, రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, హైడ్రా, మూసీ వంటివాటితో కూల్చివేతలు నిర్వహించడం, అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడన్న చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అత్యధిక చోట్ల గెలుపొందుతుందని నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. కేసీఆర్ ఉంటే బాగుండన్న చర్చ గ్రామాల్లో జరుగుతున్నట్టు తేల్చి చెప్పినట్టు తెలిసింది.