తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి ఏడు ప్యాకేజీలు, 27 భాగాలుగా విభజించి టెండర్లు పిలిచింది. అసలు పనులు మొదలుపెట్టకుండా కాలువల తవ్వకంలాంటి తోక పనులు మొదలుపెట్టింది. కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా తట్టెడు మట్టి తీయలేదు. తెలంగాణ నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావించిన. – హరీశ్
హైదరాబాద్ జూన్ 9 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తల కోలాహలం నెలకొన్నది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హరీశ్‌రావు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివచ్చాయి. అంతకుముందు ఉదయం కోకాపేటలోని హరీశ్‌రావు నివాసం పార్టీ నాయకులతో కిక్కిరిసిపోయింది. పెద్దసంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆయన వాహన శ్రేణిని అనుసరించి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్న హరీశ్‌రావు ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. కొద్దిసేపటికి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆయనతో కొంతసేపు మంతనాలు జరిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, సునీతాలక్ష్మారెడ్డి, తాటికొండ రాజయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కాలేరు వెంకటేశ్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు హరీశ్‌రావుకు సంఘీభావం ప్రకటించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని నినదించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని చెప్పారు. తర్వాత హరీశ్‌రావు జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరివెళ్లారు.
మిన్నంటిన జై తెలంగాణ నినాదాలు
విచారణకు వెళ్లేందుకు హరీశ్‌రావు భవన్ నుంచి బయటకు వస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. జై తెలంగాణ.. జై జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై హరీశన్న..’అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాం గణం దద్దరిల్లింది. కార్యకర్తలకు అభివాదం చేస్తూ, విజయ సంకేతం చూపుతూ హరీశ్‌రావు కారులో కూర్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్కే భవన్‌కు బయల్దేరగా ఆయన వాహనాన్ని వందలాది మంది నేతలు అనుసరించారు. బీఆర్కే భవన్ వద్ద సైతం కార్యకర్తల కోలాహలం కనిపించింది. విచారణ జరిగినంతసేపు అక్కడే ఉన్నారు. హరీశ్‌రావు బయటకు రాగానే మళ్లీ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో పార్టీ నేతలు దేవీప్రసాద్, నగేశ్, రవికుమార్, గెల్లు శ్రీనివాస్, చిరుమల్ల రాకేశ్, వాసుదేవారెడ్డి, ఎర్రోళ్ల, కిషోర్‌గౌడ్, బాలు, శుభప్రద్‌పటేల్, సుమిత్రా ఆనంద్, గోసుల శ్రీనివాస్ హరీశ్‌రావుకు అండగా నిలిచారు.