చేర్యాల, జూలై 27 : భూతగాదాకు సంబంధించిన ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్కు పిలిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురిలో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కొమురవెల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సాంబాని కనకయ్యకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కొంతకాలంగా భూతగాదా కొనసాగుతున్నది.
ఈ విషయంలో కర్రలు, కత్తులు పట్టుకున్న ఫొటోలను కనకయ్య ఈనెల 25న రాత్రి గ్రామ వాట్సాప్ గ్రూపులో ఫొటోలు పోస్టు చేసి కొంత సమయం తర్వాత వాటిని తొలగించాడు. కనకయ్య చేసిన పోస్టులను గమనించిన ఇతర వర్గం వారు కొమురవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్టేషన్కు రావాలని పిలవడంతో ఈనెల 26న కనకయ్య స్టేషన్కు వెళ్లాడు. తిరిగి ఆదివారం స్టేషన్కు రావాలని పోలీసుల నుంచి మళ్లీ పిలుపు రావడంతో భయపడ్డాడు. అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులు తనను ఏమైనా చేస్తారేమోనని మనస్తాపానికి గురైన కనకయ్య వ్యవసాయబావి వద్ద గడ్డి నివారణ మందు తాగాడు.
గమనించిన స్థానికులు, కుటుంబీకులు హుటాహుటిన చేర్యాల దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించారు. తన భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రాజును ఫోన్లో వివరణ కోరగా.. వాట్సాప్ గ్రూపులో పోస్టు విషయమై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం కనకయ్యను స్టేషన్కు పిలిపించామని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.