మహబూబ్‌నగర్ అర్బన్: ఆర్డీఎస్‌పై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బరాజ్‌లను అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న బరాజ్‌లు, రిజర్వాయర్లపై పోరాట ప్రణాళికను విడుదల చేస్తామని వెల్లడించారు. తెలంగాణ రైతాంగానికి నష్టంచేస్తే ప్రత్యక్షంగా రైతులను కలుపుకొని ఉద్యమిస్తామని, కర్ణాటక బరాజ్‌లు, రిజర్వాయర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వాలకు పాలమూరు జిల్లా రైతాంగం తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు కడుతున్న బరాజ్‌లు, రిజర్వాయర్లతో తెలంగాణ సాగునీటి అవకాశాలకు మరణశాసనం రాసినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో మహబూబ్‌నగర్ ప్రాజెక్ట్‌లకు నీరొచ్చే పరిస్థితి రాకుండా పోతుందని చెప్పారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఒక్కటై నీటిని తరలించేందుకు కుట్రలు చేస్తున్నాయని, దీన్ని అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ పక్క రాష్ర్టాల సీఎంలతో మిలాఖత్ అయినట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. కర్ణాటక నావలి వద్ద 50 టీఎంసీల బరాజ్ పనులు ప్రారంభించిందని, తుంగభద్రా నది పొడవునా రోడ్డు కమ్ బ్రిడ్జిలు, రిజర్వాయర్లు నిర్మిస్తూ ఎక్కడికక్కడ నీటిని నిలుపుకొనేలా పనులు చేపడుతుందని ధ్వజమెత్తారు. ఏపీలోని గుండ్రేవుల వద్ద మరో 20 టీఎంసీల రిజర్వాయర్‌కు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నదని ఆరోపించారు. ఇది పూర్తయితే శ్రీశైలానికి, తుమ్మిళ్లకు నీరొచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది నడిగడ్డను ఎండబెట్టి ప్రయత్నమేనని చెప్పారు.
ఎక్కడో కర్ణాటకలో ప్రాజెక్టు గేట్లను పునరుద్ధరిస్తే తెలంగాణ సర్కార్‌కు ఏం ప్రయోజనం కలిగిందో? రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడు సీఎం, మంత్రులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్ల పనులు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అక్రమంగా చేపడుతున్న ఆయా పనులను పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డుకోకుంటే మళ్లీ రైతులు వలసపోయే పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు.
ఆర్డీఎస్కు 100 మీటర్ల దూరంలో బ్యారేజ్ కడుతుంటే ప్రభుత్వంలో స్పందనే లేదని, అది పూర్తయితే తుంగభద్ర నుంచి శ్రీశైలానికి నీళ్లొచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కృష్ణా నీటిని కూడా తరలించుకొని వెళ్లేందుకు కుట్ర జరుగుతుందని ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశాన్ని బట్టి అర్థమవుతుందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా పనులు జరుగుతుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణ రైతులను ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.