హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి, వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేసే అంశం ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నదంటూ కిషన్రెడ్డి అబద్ధం చెప్పారని విమర్శించారు. 7 మండలాల విలీన అంశం విభజన చట్టంలో ఉంటే, ఆయన ఎన్డీయే ప్రభుత్వం 2014 మే 29న ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చిందో ఆయనే సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఏపీ పునర్విభజన బిల్లు 2014 ఫిబ్రవరి 10న రాజ్యసభలో ఆమోదం పొందిందని, దానికి రాష్ట్రపతి ఆమోదంతో 2014 మార్చి 30న గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ కేసీఆర్ నాయకత్వంలో 63 సీట్లు సాధించిందని పేర్కొన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే (అపాయింటెడ్ డే)గా కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని పేర్కొన్నారు.
ప్రధానిగా మోదీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి, మోదీతో లాలూచీ పడ్డారని ఒంటె ద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎంగా జూన్ 2న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయకముందే 7 మండలాలను ఏపీలో విలీనం చేయాలన్న కుట్రతో 2014 మే 29 ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు. అనంతరం కేసీఆర్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చి, నిరసన తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ తర్వాత ఏపీ సీఎంగా చంద్రబాబు అదే ఏడాది జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారని పేర్కొన్నారు. అసలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. ఏడు మండలాల విలీన అంశం చట్టంలో ఉన్నదని, కేసీఆర్ అనుమతితోనే జరిగిందంటూ కిషన్రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తెలంగాణవాదులు, మేధావులు, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.