Crime News | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వ్యాపారంలో ఎదుగుతున్న అన్న ఇంటికి సొంత తమ్ముడే కన్నం వేశాడు. అన్న ఇంట్లో ఉన్న వారందరినీ మరణాయుధాలతో బెదిరించి 2 కిలోల బంగారాన్ని దోపిడీ చేయించాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు ఒక న్యాయవాది సూచనలు తీసుకున్నాడు. హైదరాబాద్ దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 12న జరిగిన ఘటనను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించి రూ.1.2 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఈ వివరాలను ఆదివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. దోమలగూడలో నివాసముండే రంజిత్ ఘోరీ, ఇంద్రజిత్ ఘోరీలో వెస్ట్‌బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చారు.
రంజిత్ ఘోరీ బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాలు నిర్వహిస్తూ తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అతని సోదరుడు ఇంద్రజిత్ ఘోరీ బెట్టింగ్, ఇతర చెడు అలవాట్లకు బానిసై ఉన్నదంతా పొగుట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో అల్తాఫ్ మహ్మద్, బార్లో సయ్యద్ ఇర్ఫాన్ అహ్మద్‌తో ఇంద్రజిత్‌కు దోస్తీ ఏర్పడింది. భారీగా సంపాదిస్తున్న తన సోదరుడి ఇంటి నుంచి ఎలాగైనా దోపిడీ చేయాలని వారితో ఫ్లాన్ చేశారు. న్యాయవాది నూర్ ఉల్హా సహకారం తీసుకొని, మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సహకారంతో దోపిడీకి ప్లాన్ చేశారు.
రౌడీషీటర్ మహ్మద్ అర్బాజ్ సోహెబ్‌ఖాన్, గులాం ముక్ధుం, షేక్ ఉస్మాన్, షేక్ అల్లాఉద్దీన్, షేక్ అక్రం, అల్తాఫ్ మహ్మద్ ఖాన్, సయ్యద్ ఇర్ఫాన్, హబీబ్ ఉస్సేన్, న్యాయవాది నూర్ ఉల్హా మరికొందరితో ఇంద్రజిత్ జత కట్టాడు. వీరంతా కలిసి ఈ నెల 12న దోమలగూడ అరవింద్‌నగర్ కాలనీలో నివాసముంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఘోరీ ఇంట్లోకి చొరబడి కత్తులు, తుపాకులతో కుటుంబసభ్యులను బెదిరించి, అడ్డొచ్చిన వారిపై దాడి చేసి 2 కిలోల బంగారు నగలు దోచుకొని, ఇన్నోవా కారులో పరారయ్యారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులూ రంగంలోకి దిగారు. కేసుతో సంబంధమున్న 12 మందిని అరెస్ట్ చేశారు. షాబాజ్, నజీర్, జహీర్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 1,228 గ్రాముల బంగారు ఆభరణాలు, 616 గ్రాముల వెండి, 2 కిలోల ఇత్తడి వస్తువులు, ఇన్నోవా కారు, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని సీపీ వెల్లడించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్‌యాదవ్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, గాంధీనగర్ ఏసీపీ మొగలయ్య తదితరులు పాల్గొన్నారు.