హైదరాబాద్, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఇందుకు పరిష్కార మార్గాలపై వ్యవసాయ అధికారులు దృష్టిపెట్టారు. నూక శాతం వచ్చే వరి రకాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ వర్సిటీ యాసంగి సాగుకు అనుకూలమైన ఎనిమిది వరి రకాల విత్తనాలను సూచించింది. సాగులో జాగ్రత్తలు, సాగు విధానంపై నివేదికను రూపొందించింది. రాష్ట్ర శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్15048) వరి రకానికి అధికారులు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రకంలో షుగర్‌ను నియంత్రించేవిధంగా ైగ్లెసెమిక్ ఇండెక్స్(జీఐ) తక్కువగా ఉంటుంది.
డిసెంబర్ 10లోపు నాట్లు..
ధాన్యంలో నూక శాతం తక్కువగా రావాలన్నా, అకాల వర్షాల నుంచి పంటలను రక్షించుకోవాలన్నా వరి నాట్లు, కోతల సమయంలో జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ నేపథ్యంలో యాసంగి వరి సాగులో డిసెంబర్ 10లోపు నాట్లు వేసేలా, ఏప్రిల్ 15లోపు కోతలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవిలో ఎండ తీవ్రత పెరగకముందే వరి కోతలు అయిపోతే ధాన్యపు గింజ పగలకుండా ఉంటుంది. దాంతో ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు ధాన్యపు గింజ విరగకుండా తక్కువ నూక వస్తుంది. అదే మే నెలలో వరి కోతలతో ధాన్యపు గింజ పూర్తిగా ఎండటంతో విరిగిపోయి నూక ఎక్కువవుతుంది. నూక ఎక్కువగా కాకుండా ఉండాలంటే ఆ ధాన్యాన్ని బాయిల్డ్(ఉడకపెట్టడం) చేయాల్సి ఉంటున్నది. ఒకవేళ బాయిల్ చేస్తే.. వచ్చే బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉన్నది.
ఏపీలో ఈ రెండు రకాలే ఎక్కువ..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో యాసంగిలో వినియోగించే ఎంటీయూ 1121 వరి రకం విత్తనాల్లో నూక శాతం చాలా తక్కువగా ఉంటున్నదని పలువురు మిల్లర్లు, వ్యాపారులు తెలిపారు. మిగతా రకాల్లో 40 నుంచి 50శాతం నూక వస్తే 1121 రకంలో మాత్రం 20శాతం వరకే వస్తుందని తెలిపారు. ఏపీలో ఈ రకం విత్తనాలను అధిక సాగు చేస్తారని, అందుకు అక్కడ బాయిల్డ్ రైస్ సమస్య ఎక్కువగా ఉండదని తెలిపారు. దీంతో పాటు ఎంయూటీ 1061 రకం కూడా మేలు రకమేనని తెలిపారు. ఈ రెండు రకాలను కూడా రాష్ట్ర యాసంగిలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.