MLC Dasoju Sravan | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ఫ్యూడల్ మనస్థత్వమని, బీసీలకు 42% రిజర్వేషన్లపై గేమ్ ఆడుతూ, వారిని నయవంచనకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా తమిళనాడు తరహాలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన రాకపోయినప్పటికీ, స్థానిక ఎన్నికలు వస్తుండటంతో ఆర్డినెన్స్‌ను తీసుకు రావడానికి చేస్తున్న కుటిల ప్రయత్నాలు, కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ విధానాలకు అద్దం పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
‘విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి, ఢిల్లీకి పంపి నాలుగు నెలలు అయినప్పటికీ, ఆ బిల్లుల సంగతి ఎంతవరకు వచ్చిందో, కేంద్రంలో ఏం జరుగుతున్నదో ఏనాడైనా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేశారా? రాష్ట్రపతిని కాని, ప్రధానమంత్రిని కాని కలిసి విజ్ఞప్తి చేశారా?’ అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. బీసీ బిల్లుల సాధన కోసం అఖిలపక్షా న్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడంలేదని నిలదీశారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నాలుగు నెలల సుదీర్ఘ విరామం అనంతరం ఆర్డినెన్స్ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, రాజ్యాం గం, సామాజిక న్యాయం అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ.. బీసీ బిల్లు కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో నిర్వహించిన ‘హైడ్రామా’ ధర్నాలో పాల్గొనకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బనకచర్ల-గోదావరి నదీ జలాల దోపిడీకి ఆంధ్ర పాలకులు పాల్పడుతుంటే, దానిపై స్పందించి అఖిలపక్ష ఎంపీలతో సమావేశం ఏర్పాటుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీ రిజర్వేషన్ల అంశంపై అఖిలపక్షంతో ఎందుకు సమావేశం ఏర్పాటుచేయడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి, రిజర్వేషన్ల సాధన కోసం అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ముఖ్యమంత్రి సీట్లో ఒక్క క్షణం కూడా కూర్చునే నైతిక అర్హత కోల్పోతారని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బీసీలను రోడ్డు రోలర్ కింద అణిచివేసే కుట్ర చేస్తున్నారని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మండిపడ్డారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే అంశంపై బీసీ కమిషన్ సరిపోతుందని, దీనికి బూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు సాధించాలని తాము కోరుతుంటే, ముఖ్య మంత్రి రేవంత్ మాత్రం ఫెయిలైన, హైకోర్టు కొట్టివేసిన బీహార్ తరహా విధానాలతో ముం దుకు పోతున్నారని విమర్శించారు. ఇందులో మోసం, దగా వంటి కుట్ర కోణాలు ఉన్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో రాజకీయపరంగా ఏ, బీ, సీ, డీ,ఈ వర్గీకరణను వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బూసాని డెడ్కేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకుంటే, సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన అధ్యయన కమిటీ నివేదికను సీఎం, ఇతర మంత్రులు తీసుకున్నారని, ఈ నివేదికలను స్వీకరించే క్రమంలో ఎందుకు ఇంత పక్షపాతం చూపించారని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును 31 బీ ఆర్టికల్ కింద 9వ షెడ్యూల్లో చేర్చాల ని రాష్ట్ర ప్రభుత్వం కోరనేలేదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి ప్రశ్నించిన ఎమ్మెల్సీ దాసోజుపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేసి, తన మానసిక స్థితిని బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో రామచంద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.