హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తేతెలంగాణ): జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను స్వదేశానికి రప్పించాలని, ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి చొరవ చూపాలని మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు. పొట్టకూటి కోసం వెళ్లి దూర దేశంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వలసజీవుల కన్నీటి వేదనను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోక పోవడం దుర్మార్గమని శుక్రవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూడడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. 22నెలలు గడిచినా గల్ఫ్, ఎన్నారై సంక్షేమ బోర్డులకు అతీగతీలేకుండా పోయిందని వలస జీవుల కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ దిక్కులేకుండా పోయిందని మండిపడ్డారు.