హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ బాధ్యతను కేంద్రప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అప్పగించటంతో, ఇప్పుడు పంపిణీకి ఎన్ని టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్న దానిపై చర్చ మొదలైంది. బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునళ్లు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలపై లెక్కలు తీస్తున్నారు. గోదావరి నీటి మళ్లింపు ద్వారా ఎన్ని టీఎంసీలు వస్తాయనేది కూడా చర్చనీయాంశమైంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 89 ప్రకారం ప్రస్తుతం తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీల నీటిని వాడుకొంటున్నాయి. కొత్తగా చేపట్టబోయే పంపిణీ ప్రకారం ఈ లెక్కలు తారుమారు కానున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 194 టీఎంసీలు కేటాయించినా కోర్టు కేసుల కారణంగా వినియోగంలోకి రాలేదు. అయితే, రెండు ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఏపీకి కేటాయించిన మొత్తం జలాలు 1,005 టీఎంసీలు. వాటినే ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పునఃపంపిణీ చేయనున్నది.
ట్రిబ్యునల్-1 కేటాయింపులు
మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం మొట్టమొదటిసారి 1969లో బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 (కేడబ్ల్యూడీటీ -1) ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీ (100 ఏండ్లలో 75ఏండ్లపాటు ఒక నదిలో వచ్చిన ప్రవాహాన్ని లెక్కగట్టి సగటు నీటి లభ్యతను తీస్తారు) ద్వారా కృష్ణా నదిలో 2060 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నదని, వాటి వినియోగం ద్వారా తిరిగి నదిలోకి 70 టీఎంసీలు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా కృష్ణాలో 2,130 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లెక్కతేల్చింది. ఆ జలాల్లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను పంచింది. మిగులు జలాలు 330 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అవార్డులో ప్రకటించింది. ఎలాంటి ప్రాజెక్టులకు కేటాయించకుండా సదరు మిగులు జలాలను వినియోగించుకొనేందుకు మాత్రమే ఏపీకి వెసులుబాటు కల్పించింది. ఈ కేటాయింపులను 2000 సంవత్సరం తరువాత సమీక్షించుకోవచ్చని 1976లో తుది తీర్పు వెలువరించింది..
ట్రిబ్యునల్-2 కేటాయింపులు
బచావత్ ట్రిబ్యునల్ -1 అవార్డును సమీక్షించేందుకు కేంద్రం 2004లో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2) ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబులిటీ కింద, సగటు ప్రవాహం ఆధారంగా కృష్ణా నదిలో మొత్తం 2,578 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నదని లెక్కతేల్చింది. అందులో ట్రిబ్యునల్-1 కేటాయించిన 2,130 టీఎంసీలను మినహాయించి మిగిలిన 448 టీఎంసీల జలాలను మూడు రాష్ర్టాలకు పంచింది. మహారాష్ట్రకు 81 టీఎంసీలు, కర్ణాటకకు 173 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీలు పంచింది. తుది అవార్డును 2013లో ప్రకటించింది. ట్రిబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఏపీతోపాటు, మిగిలిన రాష్ర్టాలు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవార్డు అమలులోకి రాలేదు.
మొత్తంగా ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీలు
ఏపీ విభజన సమయంలో రెండు రాష్ర్టాల మధ్య నదీజలాల నిర్వహణ, వినియోగానికి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టం 2014లో సెక్షన్ 84-89 వరకు పలు మార్గదర్శకాలను రూపొందించారు. ఆ చట్టం ప్రకారం ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ఇరు రాష్ర్టాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని నిబంధన పెట్టారు. ఆ మేరకే కేంద్రం ప్రభుత్వం 2014లో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను సిఫారసు చేసింది. అయితే గత ట్రిబ్యునళ్లు కృష్ణా జలాలను ఆయా రాష్ర్టాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదు. ఎన్‌బ్లాక్‌గా (కేటాయించిన నదీ జలాలను నిర్దిష్ట ప్రాంతంలో కాకుండా ఎక్కడైనా వినియోగించుకోవచ్చు) కేటాయించింది. మరోవైపు నదీ జలాల కేటాయింపు అధికారం ట్రిబ్యునళ్లకు మాత్రమే ఉన్నది. గత ట్రిబ్యునళ్ల విచారణ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఉనికిలో లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తున్నది. దీంతో కేంద్రం తాజాగా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
గోదావరి నీటి మళ్లింపుపైనా స్పష్టత
పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్‌లోని రాష్ర్టాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున పంచాలి. ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన మాత్రమే, అదీ ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా షరతు విధించింది. ఈ నీటి వాటాలను కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పటికే వినియోగించుకుంటున్నాయి. నాటి ఉమ్మడి ఏపీ కూడా ట్రిబ్యునల్ 1 కేటాయించిన ఆ 45 టీఎంసీలను ఎస్ఎల్బీసీకి కేటాయించి సదరు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ అనుమతి కోసం 1985లోనే పంపించింది. అయితే అప్పటికి పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు రాకపోవడంతో సీడబ్ల్యూసీ ఆ డీపీఆర్‌ను తిప్పిపంపింది. కాగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ట్రిబ్యునల్ షరతుల మేరకు ఆ 45 టీఎంసీలు తెలంగాణకే దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. వినియోగానికి అనుమతివ్వాలని కోరుతూ కేంద్రానికి, కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. అయితే అవార్డు గోదావరి ట్రిబ్యునల్‌లో ఉన్నదని చెప్తూ అదే అమలు చేయాలని కేఆర్ఎంబీ, అవార్డు గోదావరి ట్రిబ్యునల్‌లో ఉన్నా అమలు చేయాల్సింది కృష్ణా బోర్డేనని జీఆర్ఎంబీ పరస్పరం వాదించుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ అంశాన్ని కూడా పరిష్కరించాలని కేంద్రం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు టీవోఆర్ ఇచ్చింది. దీంతో ఈ అంశంపై కూడా స్పష్టత రానున్నది.