Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ) : విద్యుత్తు సంస్థల్లో ఉన్నతస్థాయి నియామకాలు, పోస్టింగ్స్ వెనుక పెద్ద దందా నడుస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ‘పైసలిచ్చుకో.. పోస్టింగ్ తెచ్చుకో’ అన్నట్టుగా పరిస్థితి తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తున్నదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. డిస్కం సీఎండీ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) వరకు పోస్టింగ్‌ను బట్టి రేటు నడుస్తున్నదని చెప్పుకుంటున్నారు. డిస్కం సీఎండీ పోస్టుకు రూ.20 కోట్లు అని, రూ.50 కోట్లు అని విద్యుత్తు సంస్థల ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ‘ఫలానా వారికి కన్ఫర్మ్ అయ్యింది, పోస్టింగ్ రావడమే తరువాయి’ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. డైరెక్టర్ పోస్టుకు రూ.రెండు కోట్లు అంటూ ప్రచారం జరుగుతున్నది. 2024 జనవరిలో కొత్త డైరెక్టర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించగా, ఐదు పోస్టులకు దాదాపు 91 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కరే రెండు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో మొత్తంగా 152 దరఖాస్తులొచ్చాయి. వీరికి ఈ నెల 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్ పోస్టులపై ఓ ఇద్దరు సీజీఎం స్థాయి అధికారుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘ఏం సార్.. కొత్త డైరెక్టర్ మీరేనట?’ అని ఓ అధికారి అనగా, ‘వామ్మో.. రూ.రెండు కోట్లు అంట! నేనైతే ఇచ్చుకోలేను. నా వల్ల కాదు. రూ.రెండు కోట్లు ఎక్కడి నుంచి తేవాలి?’ అంటూ మరో అధికారి జవాబిచ్చారు. ఈ లెక్కన డిస్కంలలో డైరెక్టర్ పోస్టులకు రూ.రెండు కోట్లు పలుకుతున్నట్టు ఈ చర్చలను బట్టి స్పష్టమవుతున్నది. డైరెక్టర్ పోస్టుల కోసం ప్రధానంగా రిటైర్డ్ సీఈలు, సీజీఎంలు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు సైతం డైరెక్టర్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. డైరెక్టర్ పోస్టు కోసం ఒక మహిళా అధికారి ఏకంగా ఏఐసీసీ అగ్రనేతను ఆశ్రయించినట్టు తెలిసింది. ఆయన నుంచి అభయం దొరకడంతో తనకు డైరెక్టర్ పోస్టు ఖాయమైనట్టు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు.
గతంలో విద్యుత్తు సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)లను సీఎండీల స్థాయిలోనే బదిలీచేసేవారు. ఇతరులెవరూ కింది స్థాయి బదిలీల్లో జోక్యం చేసుకునే వారు కాదు. డీఈ ఆ పై స్థాయి బదిలీలు, పోస్టింగ్‌ల్లో మాత్రమే పై స్థాయిలోని వారు కల్పించుకునే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏఈల బదిలీల్లోనూ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు. చిన్నస్థాయి పోస్టు అయిన ఏఈ బదిలీకి, పోస్టింగ్‌కు సైతం పై నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్ధం చేసుకోవచ్చని విద్యుత్తురంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆపరేషన్స్ డివిజినల్ ఇంజినీర్ (డీఈ) పోస్టుకు రూ.40 లక్షలు సమర్పించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక ఎమ్మెల్యే ద్వారా ఒక డీఈ మంత్రాంగం నడిపారని తెలిసింది. ఈ ప్రయత్నం ఫలించగా, రూ.40 లక్షలు ముట్టజెప్పినట్టు ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. మేడ్చల్ సర్కిల్లోని ఈ డీఈ పోస్టు ఫోకల్ పోస్టు కావడంతో రూ.40 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. పోస్టింగ్స్ కోసం వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక సీఎండీ ఒకరు, ‘ఇప్పుడైతే పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. రేపు ఎట్లా పనిచేస్తారో చూస్తా’ అని హెచ్చరించడం గమనార్హం. అవినీతి ఇంజినీర్లు, అధికారుల చిట్టాను ఏసీబీకి అందజేస్తానంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించినట్టు విద్యుత్తు ఇంజినీర్లే చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు అసోసియేషన్ నేతలు పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్లో ఫోకల్ పోస్టులు ఖాళీ అవుతున్నాయనంటే కర్చిఫ్ వేసేందుకు మరొకరు సిద్ధమవుతున్నారు. ఇక ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్చేందుకు కొందరు అసోసియేషన్ నేతలు రూ.రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.