మంచిర్యాల, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్ కావాల్నంటే ఏఈ సార్‌కు రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇవ్వాలె.. నేరుగా ఇచ్చినా పర్లేదు. సారు ఇంకో నంబర్‌కు ఫోన్‌పే చేసిన పర్లేదు. డబ్బులిస్తే పది.. పదిహేను రోజుల్లో కొత్త పోల్స్ వేసి, కరెంట్ వైర్లు తీసి కనెక్షన్ ఇచ్చిపోతరు. లేదంటే ఏండ్ల తరబడి తిరిగినా కరెంట్ రాదు.’ ఇదీ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం విద్యుత్తు శాఖ అసిసెంట్ ఇంజినీర్ (ఏఈ) మిట్టపల్లి మల్లయ్య తీరు. ‘సార్ చేతులు తడపందే కరెంట్ రాదు.. పొలాలు ఎండుతున్నా ఆయన మనసు కరగదు’ అని ఊరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు పడలేదని, 6 నెలల్లోనే ఆగమైనమని వాపోతున్నారు.
ఇదే మండలం గొల్లపల్లికి చెందిన దాదాపు 25 మంది రైతులు కొన్ని రోజులుగా లో ఓల్టేజీతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని 13 మంది రైతులు తలా రూ.3వేల చొప్పున జమ చేసివిద్యుత్తు శాఖకు డీడీ తీశారు. జనవరి 18, 2024లో డీడీ తీస్తే సార్‌కు డబ్బు ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. ఆ సమయానికి నీరందక దాదాపు 100 ఎకరాల్లో వరి ఎండిపోయింది. కరెంట్ లేక పొలాలు ఎండుతున్నయని ఓ రైతు విద్యుత్తు శాఖ సీఎండీకి ఫిర్యాదు చేశాడు. పొలం ఫొటోలను వాట్సాప్‌లో పంపి స మస్య వివరించాడు. దీనిపై సీఎండీ కార్యాలయం నుంచి ఏఈని వివరణ కోరితే అదే గ్రామంలో నీళ్లు న్న వేరే పొలం ఫొటోలు తీసి పంపి సీఎండీనే తప్పుదోవ పట్టించాడు. ఆ ఫొటోలు రైతుకు పంపి నీళ్లున్నయట కదా? అని అడిగితే ‘మీరు రండి సార్.. నీళ్లెక్కడున్నాయో చూపించడి’ అంటూ ఆ రైతు పట్టుపట్టాడు. ఉన్నతాధికారులు వచ్చి ఏఈని తీసుకొని ఎం డిన పొలం దగ్గరికి వచ్చి ‘ఇదేనా మీరు నీళ్లున్నయని చెప్పి పంపిన ఫొటో’ అని నిలదీయడంతో ఉలుకూ పలుకూ లేకుండా మిన్నకుండిపోయాడు. ఇక ఏఈపై చర్యలు తీసుకుంటారేమో అని రైతులు భావించినా ఉన్నతాధికారులు ఆయననే కొనసాగించారు. చేసేదేంలేక రైతులు ఏఈకి 10 వే లు ఫోన్ పో ద్వారా సమర్పించుకున్నారు. అయినా పని పూర్తికాలేదు.
ఈ వంద ఎకరాల్లో పొలాలున్న కొందరు రైతులు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్తంభాల ఏర్పాటు, కనెక్షన్ కోసం డీడీలు కూడా చెల్లించారు. తీరా సార్‌కు ఎప్పుడు ఫోన్ చేసినా ‘రేపు, మాపు’ అంటూ ముఖం చాటేశాడు. మెండె వెంకట్ అనే రైతు ఈ ఏడాది జనవరిలో పోల్స్, వైర్లకు 36,500, ఆన్లైన్ డీడీ మరో 5,600 కట్టాడు. కాగితాల ఖర్చు కోసం వెంకట్ పక్క పొలం రైతును 1500 ఏఈకి పంపాడు. ‘మేం రోజూ సార్ కు ఫోన్ చేస్తున్నం. ఎప్పుడు చేసినా రేపు వస్తామని తప్పించుకుంటున్నడు. ఆయన నిర్లక్ష్యంతో ఎకరంన్నర పొలం ఎండిపోయింది. 60వేల దాకా నష్టం వచ్చింది. నాలాంటి బాధితులు మా ఊరిలో 15, 20 మంది దాకా ఉన్నరు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మరీ చెప్తారు. మాకు న్యాయం జరిగేలా చూడండి.’ అని రైతు వెంకట్ వేడుకున్నాడు.
మాకు ట్రాన్స్ఫారం కావాలని రైతులందరం కలిసి రూ.39వేలు డీడీ తీసినం. జనవరిలో దరఖాస్తు పెట్టుకుంటే మార్చిలో వచ్చి పనులు చేసిన్రు. అప్పటికే మా పంటలు ఎండిపోయినయ్. దరఖాస్తు చేసి నెల రోజులు చూసి సార్‌ను అడిగితే డబ్బులు కొట్టుమన్నడు. రూ.10వేలు వెంటనే ఆయన రెండో నంబర్‌కు ఫోన్‌పే చేసినం. అయినా పనికాలేదు. చివరికి ఎండిన పొలాల ఫొటోలు తీసి సీఎండీకి పంపినం. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– విఘ్నేశ్, రైతు, గొల్లపల్లి
మా పంట పొలాలకు విద్యుత్ కనెక్షన్ కావాలని 2020 మార్చిల రూ.1,04,000 డీడీ కట్టి నం. రెండేండ్లు నానబెట్టి న్రు. చివరికి లేబర్లు లేరంటే సొంత ఖర్చులతో స్తంభాలు వేయించుకున్నం. అదయినంక ఏదో ఎస్టిమేషన్ మారిందని మళ్లీ ఈ మధ్య అదనంగా 80 వేలు డీడీ కట్టించుకున్నరు. గతంలో ఎస్ఈ శేషారావు విచారణకు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య చెప్పినం.
– జాడి శ్రీనివాస్, రైతు గొల్లపల్లి
గొల్లపల్లిలో 30 మంది రైతులు డీడీలు తీశాక విద్యుత్తు కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నట్టు ఫిర్యాదు వచ్చింది. మంగళవారం గ్రామానికి వెళ్లి రైతులను ఆరా తీశాం. కనెక్షన్ల కోసం ఏఈకి ఫోన్ పే ద్వారా డబ్బు చెల్లించినట్టు రైతులు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు వరంగల్‌లోని ఉన్నతాధికారులకు పంపించాం. రిపోర్టు ఆధారంగా చర్యలుంటాయి.
-శ్రావణ్‌కుమార్, ఎస్ఈ, విద్యుత్ శాఖ, మంచిర్యాల జిల్లా.