Telangana | రాష్ట్రంలో గురుకులాలు, సర్కారు బడుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అవి గురుకులాలా, నరక కూపాలా అని ప్రశ్నించారు. మీకు బీర్లు, బిర్యానీలు… బీద బిడ్డలకు బొద్దింకలా అని మండిపడ్డారు. మీకు విందు భోజనాలు.. విద్యార్థులకు విషమా… మీ పిల్లలకు అందలాలు.. పేద పిల్లలకు అంత్యక్రియలా.. అంటూ ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ తెగువ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని వై.సతీశ్ రెడ్డి అన్నారు. బిడ్డల మరణాలకు, బిడ్డల అనారోగ్యానికి కారణమైన వాళ్లను బొందపెట్టాలని డిమాండ్ చేశారు. నేడు 48 మంది గురుకుల బిడ్డలను బలిచ్చారని.. ఇకనైనా మేలుకోకపోతే.. రేపు 480 మందిని, ఎల్లుండి 4800 మందిని బలిదేవతకు బలిస్తారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ సంక్షేమ భవన్‌ను ముట్టడించిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకుల అరెస్ట్‌ను సతీష్ రెడ్డి ఖండించారు. మంచి భోజనం పెట్టాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వరుస దారుణాలపై మేధావులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. విద్యా కమిషన్, ఫుడ్ సేఫ్టీ కమిషన్, మహిళా కమిషన్ కేవలం ప్రైవేటు సంస్థల్లోకి వెళ్లడానికేనా..? ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోరా…? బిడ్డల ప్రాణాలు పోతున్న అటువైపు కన్నెత్తి చూడరా అని ప్రశ్నించారు.