హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఆరేండ్లలోపు చిన్నారుల్లో పాష్టికాహారలోపం నివారణకే అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి శనివారం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ‘తొలిముద్ద’ను ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పౌష్టికాహారం లోపంతో చిన్నారుల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించే బ్రేక్‌ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి ఎన్ని పథకాలు రూపొందించినా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉన్నదని సూచించారు. వారు చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకొని పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తున్నదని చెప్పారు. వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.