హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేవని, అందుకే వర్షాలకు బ్రేక్ పడిందని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారం నుంచి పది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం దాదాపు లేదని తెలిపింది. ఎండలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం వేళ అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉండవచ్చని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గంటకు 30నుంచి 40 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఈనెల 23నుంచి కురిసిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం తీరిందని తెలిపింది.
ఈ సీజన్లో అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో ఒకేరోజు 23.7 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 21.9 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. గడిచిన 24గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 8.2 సెం.మీ, అశ్వారావుపేటలో 5.8 సెం.మీ, పినపాకలో 5 సెం.మీ, దమ్మాయిగూడెంలో 4.5 సెం.మీ, చర్లలో 3.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి సాధారణం కంటే 7% అధిక వర్షపాతం నమోదు అయినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు దేశంలో 447.8 మి.మీ వర్షం కురిసిందని చెప్పింది. వాస్తవానికి దేశంలో సాధారణ వర్షపాతం 418.9 మి.మీ ఉండగా, ఈ సీజన్లో కొన్ని రాష్ట్రాల్లో ఎకువగా వర్షాలు పడినప్పటికీ.. అకడ సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదయ్యాయని పేర్కొన్నది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, గోవా, త్రిపుర, మిజోరం, బంగాల్, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి సహా అండమాన్, నికోబార్ దీవుల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించింది.