హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న గ్రీన్ఫీల్డ్ హైవే (Greenfield Highway) ప్రాజెక్టుకు హైకోర్టు (High Court) బ్రేకులు వేసింది. భూసేకరణ విషయంలో అభ్యంతరాలు, అభిప్రాయాలను పరిశీలించకుండా, పరిహారం విషయంలో లేవనెత్తిన అంశాలను పరిష్కరించకుండా భూముల స్వాధీన ప్రక్రియ జరుగుతున్నదన్న రైతుల వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నది. తక్షణమే భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులతో సర్క్యులర్ జారీచేసింది. అప్పటివరకు ఆ భూములను యథాతథంగా ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. భూసేకరణ ప్రక్రియ విషయంలో ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేసిన హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఈ నెల 29న జరిగే విచారణలో రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తుందని, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల అంశంలో భూసేకరణ మరి కొంతకాలం వాయిదా పడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అటకెక్కుతున్న ప్రాజెక్టులు
కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అటకెక్కుతున్నాయి. ప్రభుత్వంలో పారదర్శకత, ప్రాజెక్టుల విధివిధానాల్లో లోపాలు బట్టబయలైతున్నాయి. చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకు బ్రేకులు పడుతున్నా.. ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడంలేదు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు కూడా తాజాగా హైకోర్టు బ్రేకులు వేసింది. ఇలా వివాదాలతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే నీరుగారుస్తున్నది. ఇప్పటివరకు చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా విజయవంతంగా కార్యరూపం దాల్చలేదు. అట్టహాసంగా ప్రతిపాదనలు రూపొందించడం, అడ్డగోలుగా భూములు సేకరించడంతో ప్రాజెక్టులు ముందు కు సాగడంలేదు. తాజాగా అవుటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఊహానగరి మీదుగా ట్రిపులార్ వరకు హెచ్ఎండీఏ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టును కూడా మధ్యంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. కనీసం భూసేకరణ కూడా చేయడానికి వీల్లేకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
గ్రీన్ఫీల్డ్ హైవే తీరిది
అవుటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 వద్ద రావిర్యాల నుంచి ట్రిపులార్ను అనుసంధానం చేస్తూ ఇప్పుడున్న రహదారులను కాదనీ కాంగ్రెస్ సర్కారు గ్రీన్ఫీల్డ్ హైవేకు ప్రణాళికలు సిద్ధంచేసింది. ఇందులో భాగంగా కేవలం పేద, చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా అలైన్మెంట్కు అనుగుణంగా నిరుడు అక్టోబర్లో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసింది. అప్పటినుంచి పదుల సంఖ్యలో రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు కోసం బలి చేయవద్దని కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ భూసేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ 30 మంది రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఓవైపు వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే.. హడావుడిగా భూముల సర్వే, భూసేకరణ నోటిఫికేషన్, టెండర్ల ప్రకటన, వివాదాస్పద కంపెనీకి నిర్మాణ పనులు కట్టబెట్టడం వరకు అన్నింట్లోనూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. ప్రధానంగా భూసేకరణ విషయంలో బాధిత రైతులకు జరుగుతున్న నష్టమే మొదటి నుంచి చర్చకు తావిస్తుండగా.. ఇప్పటివరకు ఆ రైతులతో ప్రాజెక్టు తీరుతెన్నులపై చర్చించకుండానే భూములు లాక్కునే ప్రయత్నం చేసింది. ఇదే అక్కడి రైతులను హైకోర్టును ఆశ్రయించేలా చేసింది. వారంతా భూసేకరణ ప్రక్రియను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలను ఇచ్చింది.
నిలిచిపోతున్న కాంగ్రెస్ ప్రాజెక్టులు
రెండేండ్ల రేవంత్రెడ్డి సర్కారు పాలనలో ఆరంభించిన ప్రాజెక్టుల కంటే.. అటకెక్కిన వాటి జాబితానే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించాల్సి ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు, ఇటీవల తలపెట్టిన స్కైవాక్ వేలు, తాజాగా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు వరకు విధానపరమైన లోపాలతో చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి. కేవలం ప్రాజెక్టులను ప్రతిపాదించడం, నచ్చిన కంపెనీలకు పనులు అప్పగించడం, భూసేకరణ కోసం అడ్డగోలు విధానాలను అమలుచేయడం వరకే తమ తీరు అని కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది.