బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి ఇక లేరు

- చిన్నవయసులోనే పురాణాలపై అధ్యయనం
- 15వ ఏట నుంచే శాస్త్రబద్ధంగా ప్రవచనాలు
- ఇతిహాసాలను సామాన్యులకు చేర్చిన ఘనుడు
- టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా సేవలు
- సమయోచిత వ్యాఖ్యానాలతో ప్రజలకు చేరువ
- పీవీ, బూర్గుల వంటి వారినీ మెప్పించిన ఘనాపాఠి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/ముషీరాబాద్/చిక్కడపల్లి, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వేద పండితుడు, ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శివైక్యమయ్యారు. వయోభారంతో శుక్రవారం సాయం త్రం హైదరాబాద్‌లోని నివాసంలో కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్న, ఆరుగురు మగ పిల్లలు (రామకృష్ణ, వీరరాఘవ శర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి), ఇద్దరు ఆడపిల్లలు (ఆదిలక్ష్మి, సరస్వతి) ఉన్నారు. రామాయణ, మహాభారత, భాగవతాలపై ఎంతో పట్టున్న చంద్రశేఖర శాస్త్రి.. 15వ ఏట నుంచే శాస్త్రబద్ధంగా ప్రవచనాలు చెప్తూ ఎందరికో ధర్మ మార్గాన్ని చూపారు. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణాలను కలగలిపి శ్రోతలను ఆకట్టుకునేలా ప్రవచనం చేయడంలో సుప్రసిద్ధులైన ఆయన.. టీటీడీ ఆస్థాన శాశ్వత పండితుడిగా ప్రసిద్ధికెక్కారు. 1925 ఆగస్టు 28న గుంటూ రు జిల్లా క్రోసూరులో మల్లాది దక్షిణామూర్తి, శారదాంబ దంపతులకు ఏడో సంతానంగా చంద్రశేఖర శాస్త్రి జన్మించారు. ఆయన తాత మల్లాది రామకృష్ణ విద్వత్ చయనులు. పాండిత్యాన్ని ఔపోసన పట్టిన వ్యక్తి. ఆయన నుంచి వేద జ్ఞానాన్ని అందిపుచ్చుకొన్న చంద్రశేఖర శాస్త్రి తన పరంపరను దిగ్విజయంగా కొనసాగించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ వేడుకలకు ఉషశ్రీతో కలిసి ప్రత్యక్ష వ్యాఖ్యానాల్లో పాల్గొన్న చంద్రశేఖర శాస్త్రి.. దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి దాదాపు రెండున్నర దశాబ్దాలకుపైగా ప్రభుత్వ ఉగాది వేడుకల్లో పంచాంగ పఠనంతో విశేష ఆదరణ పొందారు. ఆకాశవాణిలో తిరుమల బ్రహ్మోత్సవాలు, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో సమయోచిత పద్యాలు, శ్లోకాలతో వాఖ్యానం చేసి అశేష ప్రజానీకానికి చేరువయ్యారు. 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన చంద్రశేఖర శాస్త్రి.. 1972లో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేయడంతోపాటు హైదరాబాద్‌లో ఆడిటర్‌గా సేవలందించారు. 1986లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారారు. వేదం, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క, వేదస్త సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన చంద్రశేఖర శాస్త్రి.. భారతం ధర్మసూక్ష్మ దర్శనం, కృష్ణలహరి, రామాయణ రహస్య దర్శిని, భాగవత తత్వం తదితర గ్రంథాలను రాశారు.
ప్రవచనాలు వింటే మంత్రముగ్ధులవ్వాల్సిందే
భద్రాద్రిలో సీతారాముల కల్యాణం, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునుల కల్యాణానికి చంద్రశేఖర శాస్త్రి వ్యాఖ్యానం చేస్తుంటే ఎంతటి వారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. వేదం, తర్కం, వేదాంతం, మీమాంస, వ్యాకరణం, పంచదశి, వేదాంత భాష్యాలను చదివిన చంద్రశేఖర శాస్త్రి.. ఇప్పటి వరకు దాదాపు 250 రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలు చెప్పి లక్షల మంది అభిమానులను సంపాదించుకొన్నారు. దివంగత బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు లాంటి రాజకీయ ఉద్ధండులతోపాటు చిత్తూరు నాగయ్య, ఘంటసాల, ఎస్వీ రంగారావు లాంటి ఎంతో మంది ప్రముఖులు చంద్రశేఖర శాస్త్రి అభిమానుల జాబితాలో ఉన్నారు.
ఉపరాష్ట్రపతి, ప్రముఖుల సంతాపం
చంద్రశేఖర శాస్త్రి పరమపదించటం విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక దృక్పథాల సమ్మేళనంగా సాగిన చంద్రశేఖర శాస్త్రి ప్రవచనాలు ఎంతో మందికి మార్గనిర్దేశం చేశాయని ట్విట్టర్లో ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. చంద్రశేఖర శాస్త్రి మృతి పట్ల రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభీ వాణిదేవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకొంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి లేరన్న వార్త తనను ఎంతో బాధిస్తున్నదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు
సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో చంద్రశేఖర శాస్త్రి ఎన్నో సత్కారాలు, బిరుదులను అందుకొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయన.. స్వామివారి కల్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసి ‘అభివన వ్యాస’ బిరుదును, శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి నుంచి ‘సవ్యసాచి’ బిరుదును పొందారు. సనాతన ధర్మ ట్రస్టు నుంచి సిటిజన్ అవార్డులను, మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు చేతుల మీదుగా విశిష్ట సత్కారాన్ని అందుకొన్నారు. 2005లో ప్రతిష్ఠాత్మక రాజా-లక్ష్మి అవార్డు ద్వారా వచ్చిన లక్ష రూపాయలను సనాతన ధర్మ ట్రస్టుకు విరాళమిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

